గోధ్రా: గుజరాత్‌లోని ఓ కేంద్రంలో నీట్ నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పంచమహల్ జిల్లాలోని గోధ్రాలో కొందరు అభ్యర్థులు మెరిట్ సాధించేలా ఓ పాఠశాల టీచర్ వారితో అనైతిక ఒప్పందం చేసుకున్నాడు. రూ.10 లక్షలిస్తే వారి పరీక్ష తానే రాస్తానని హామీ ఇచ్చాడు. చివరకు అతడి బండారం బయటపడి పోలీసులకు చిక్కాడు. గోధ్రాలోని ఓ పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తుషార్ భట్.. నీట్ పరీక్షకు డిప్యూటీ సూపరింటెండెంట్‌గా వ్యవహరించాడు. పరీక్షలో మంచి ర్యాంకు వచ్చేలా చేస్తానంటూ 16 మంది అభ్యర్థులతో అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. వచ్చిన జవాబులు రాసి.. రాని వాటిని ఖాళీగా వదిలేసి వెళ్లాలని వారికి చెప్పాడు. పరీక్ష పూర్తయిన తర్వాత పేపర్లు తీసుకుని తానే వాటిని పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు. ఇందుకోసం ఒక్కో అభ్యర్థి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అతడి సలహా మేరకు ఓ అభ్యర్థి రూ.7లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. విద్యాశాఖ అధికారులు తుషార్ భట్‌ను ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించాడు. అతడి మొబైల్‌లో 16 మంది అభ్యర్థుల పేర్లు, రోల్ నంబర్లను అధికారులు గుర్తించారు. అడ్వాన్స్‌గా తీసుకున్న సొమ్మును నిందితుడి కారు నుంచి స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తుషార్, అతడికి సాయం చేసిన మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.