mParivahan App | ఈ యాప్స్ ఉంటే.. డ్రైవింగ్ లైసెన్స్.. ఆర్సీ వెంట లేకున్నా నో ప్రాబ్లం

MParivahan App | ఇప్పుడు ప్రతి ఒక్కరూ టూ వీలర్.. కారు నడుపుతున్నారు. అయితే, వాహనాల యజమానులు రోడ్లపైకి వస్తే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. ఒకవేళ పొరపాటుగా డ్రైవింగ్ లైసెన్స్ మరిచిపోయినా, ఆర్సీ, పొల్యూషన్ సర్టిఫికెట్, బీమా పాలసీ సర్టిఫికెట్ వంటి పత్రాలు లేకున్నా వాహనాల యజమానులు ఇబ్బందుల్లో పడ్డట్లే.


మోటారు వాహన చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలు లేకుండా ట్రాఫిక్ పోలీసులకు చిక్కారో సుమారు రూ.5000 వరకూ ఫైన్ పే చేయాల్సిందే.

అయితే, అంతా డిజిటలైజేషన్ అవుతున్న నేపథ్యంలో ఆందోళన చెందనక్కర్లేదు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, తదితర పత్రాలు వెంట పెట్టుకోవాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు ఒకే చోట ఉండేలా యాప్స్ రూపొందించిందీ కేంద్ర ప్రభుత్వం. డిజిలాకర్, ఎం-పరివాహన్ వంటి మొబైల్ యాప్ ల్లో డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్ సీ), పొల్యూషన్ సర్టిఫికెట్, బీమా పాలసీ సర్టిఫికెట్ అప్ లోడ్ చేసుకోవచ్చు. 2018 నుంచి కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఈ డిజిలాకర్, ఎం-పరివాహన్ యాప్స్‌లో అప్ లోడ్ పత్రాలను నిజమైన డాక్యుమెంట్స్ గా పరిగణించాలని తెలిపింది.