‘టమాటో రసం’ ఇలా పెట్టారంటే కూరలు పక్కనపెట్టి అన్నం మొత్తం తినేస్తారు.. టమాటాలు మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందించే కూరగాయల్లో ఒకటి.
రోజూ అనేక రకాల వంటల్లో టమాటాలను చాలా మంది ఉపయోగిస్తారు.
ఇవి నేరుగా వివిధ వంటకాల తయారీకి కూడా ఉపయోగపడతాయి. అయితే, టమాటాలతో రసం తయారు చేసుకుని తాగితే అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా పొందవచ్చు. టమాటా రసం తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
టమాటా రసం తయారీకి కావల్సిన పదార్థాలు:
తరిగిన టమాట ముక్కలు – 2 కప్పులు
చింతపండు – 50 గ్రాములు
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – 1 టీ స్పూన్
ధనియాలు – 1 టీ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
మెంతులు – 1 టీ స్పూన్
ఎండు మిరపకాయలు – 4
వెల్లులల్లి రెబ్బలు – 5
ఎండు కొబ్బరి ముక్కలు – 2 లేదా 3
అల్లం ముక్కలు – 2 (చిన్నవి)
నీళ్లు – 2 గ్లాసులు
నూనె – 1 టీ స్పూన్
తాళింపు కోసం కావల్సిన పదార్థాలు:
నూనె – 2 టీ స్పూన్స్
జీలకర్ర – 1 టీ స్పూన్
ఆవాలు – 1 టీ స్పూన్
ఎండు మిర్చి – 2
కరివేపాకు – 1 రెబ్బ
తరిగిన ఉల్లిపాయ ముక్కలు – 1/4 కప్పు
తరిగిన కొత్తిమీర – కొద్దిగా
టమాటా రసం తయారీ విధానం:
ఒక గిన్నెలో 1 టీ స్పూన్ నూనె వేసి, తరిగిన టమాట ముక్కలు, చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి, టమాటాలు మెత్తగా ఉడికే వరకు మగ్గనివ్వాలి. ఒక జార్ లేదా రోట్లో నీళ్లు తప్ప, మిగిలిన అన్ని పదార్థాలను (ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిరపకాయలు, వెల్లుల్లి, కొబ్బరి ముక్కలు, అల్లం) వేసి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.
ఉడికిన టమాటాలలో 2 గ్లాసుల నీటిని పోసి, మరో 10 నిమిషాలు ఉడికించాలి.ఒక కళాయిలో 2 టీ స్పూన్స్ నూనె వేసి కాగిన తరువాత, కొత్తిమీర తప్ప మిగిలిన తాళింపు పదార్థాలను (జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు) వేసి వేయించాలి.
తాళింపు వేగిన తరువాత, రుబ్బి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి కొద్దిగా వేయించి, ఉడికించిన టమాటా రసాన్ని జోడించి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని మరో 10 నిమిషాలు ఉడికించి, చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఇలా తయారైన టమాటా రసం రుచికరంగా ఉంటుంది. టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలున్నవారు ఈ రసం తాగితే త్వరగా ఉపశమనం పొందవచ్చు. అలాగే, శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుతాయి.
































