ఐదేళ్లలో సజ్జల సలహాల ఖర్చు రూ. 140 కోట్లు !

వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ సలహాదారుల కోసమే ఖర్చు పెట్టింది అక్షరాలా రూ.680 కోట్ల ప్రజాధనం. ఈ లెక్కను జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
ఎంత మంది సలహాదారులు ఉన్నా.. ఎవరి సలహాలు తీసుకోరు. కావాలని అడగరు. కానీ అందరి సలహాలు ఒక్కరే ఇస్తారు. ఆయనే సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన కోసం ప్రభుత్వం ప్రజాధనం ఖర్చు చేసింది అక్షరాలా రూ.140 కోట్లు. ఇందులో ఆయన జీత భత్యాలు, మెయినటెనెన్స్, ఆయన వంది మాగధులు.. ఇలా మొత్తం ప్రజా ధనం నుంచే చెల్లించారు.


ప్రభుత్వం నియమించిన సలహాదారులు ఎవరు? ఎన్ని సలహాలు ఇచ్చారు? వారికి ఎంత మేర ఖర్చు చేశారు అనే వివరాలపై ప్రభుత్వం శాసనసభ వేదికగా సమాధానం చెప్పాలని నాదెండ్ల డిమాండ్ చేశారు. 89 మంది సలహాదారులను ప్రభుత్వం నియమించడం, వారి అర్హతలను ఎవరికి తెలియకుండా దాచిపెట్టడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. సలహదారుల నియామకం విషయంలో హైకోర్టును కూడా ప్రభుత్వం తప్పుదారి పట్టించింది. ముఖ్యమంత్రి కనీసం పాలనలో ఒక్క విలేకరుల సమావేశం కూడా నిర్వహించని ముఖ్యమంత్రి సలహాదారుల నుంచి ఏం సలహాలు తీసుకున్నారో ప్రజలకు తెలియాలని నాదెండ్ల డిమాండ్ చేశారు. సీఎంతో రోజూ మాట్లాడేది కేవలం ఇద్దరు సలహాదారులు మాత్రమే. సీఎం మీడియా ముందుకు వచ్చి.. తాను పెట్టుకున్న సలహాదారులు వివరాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

రూ.140 కోట్లు ఒక్క సజ్జల కోసం ఖర్చు చేస్తే ఏమనుకోవాలని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ సొమ్మును తీసుకొంటూ.. ప్రతిపక్షాలను సజ్జల విమర్శిస్తారా అని ప్రశ్నించారు. అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలను వదిలేసి సలహాదారుల కోసం 680 కోట్లు ఖర్చు పెడతారా? ఏ బడ్జెట్ కింద ఈ డబ్బు ఖర్చు పెట్టారో రేపు శాసనసభ సమావేశాల్లో చెప్పాలి. అసలు సలహాదారుల్లో ఎంతమందికి ఆ అర్హత ఉందో చెప్పాలని . సీఎం వివరణ ఇవ్వాలని నాదెండ్ల డిమాండ్ చేశారు.