పెరుగుతున్న డయాబెటిస్ కేసులు.. ముందుగానే ఇలా చేస్తే మహమ్మారికి చెక్ పెట్టొచ్చంట..

మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ప్రీ-డయాబెటిస్ గా పేర్కొంటారు.. అయితే, మీ ఆహారం అలవాట్లను మార్చుకోవడం ద్వారా, అది డయాబెటిస్‌గా మారకుండా నిరోధించవచ్చు. ఆహారంలో ఎలాంటి మార్పులు తీసుకోవాలి.. ఏ విషయాలను గుర్తుంచుకోవాలి..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..


ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా లక్షలాది మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. శరీరంలో ఇన్సులిన్ తగినంత పరిమాణంలో ఉత్పత్తి కానప్పుడు, గ్లూకోజ్ రక్తంలో చేరడం ప్రారంభమవుతుంది.. ఇది డయాబెటిస్‌కు కారణమవుతుంది. డయాబెటిస్ దీర్ఘకాలిక వ్యాధి.. వాస్తవానికి ఇది జీవక్రియ సంబంధిత వ్యాధి.. దీనిని ఆహారంతో నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. వైద్యపరిభాషలో చెప్పాలంటే.. డయాబెటిస్ అనేది, శరీరం ఆహారాన్ని శక్తిగా మార్చే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితి. శరీరంలో తగినంత ఇన్సులిన్ లేకపోవడం వల్ల డయాబెటిస్ వస్తుంది.

అయితే.. డయాబెటిస్ వచ్చే ముందు, ఒక వ్యక్తి ప్రీ డయాబెటిస్ దశలో ఉంటాడు.. రక్తంలో చక్కెర స్థాయి 100 నుంచి 125 mg/dL మధ్య ఉంటే, ఆ వ్యక్తి ప్రీ-డయాబెటిక్ అని అర్థం. అటువంటి పరిస్థితిలో, మీ జీవనశైలిలో, ఆహారంలో అవసరమైన మార్పులు చేసుకోవడం ద్వారా.. అది డయాబెటిస్‌గా మారకుండా నిరోధించవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.

ఢిల్లీలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లోని డాక్టర్ సంచయన్ రాయ్ (సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్) మాట్లాడుతూ.. ప్రీ-డయాబెటిస్ గుర్తించిన వెంటనే మీరు కొన్ని తక్షణ చర్యలు తీసుకుంటే, దానిని నియంత్రించవచ్చన్నారు. చాలా సార్లు ప్రజలు ఈ వైద్య పరిస్థితి గురించి నిర్లక్ష్యంగా ఉంటారని, దీని కారణంగా వారికి మధుమేహం వస్తుందని నిపుణులు అంటున్నారు. కానీ మీ ఆహారం, జీవనశైలిని మార్చుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చన్నారు.

ఆహారంలో ఎలాంటి పదార్థాలను చేర్చాలి..
డాక్టర్ సంచయన్ రాయ్ మాట్లాడుతూ.. మీరు ప్రీ-డయాబెటిస్ గురించి తెలుసుకున్న తర్వాత, మీ ఆహారాన్ని మార్చుకోవాలి. ఇలాంటి సమయంలో మరిన్ని పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు తినండి. ఇది మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. మీ ఆహారం నుంచి ప్రాసెస్ చేసిన చక్కెర, కార్బోహైడ్రేట్లను తొలగించాలని నిపుణులు చెబుతున్నారు.

రోజూ వ్యాయామం చేయండి..
ప్రీ డయాబెటిస్ సమయంలో మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. నడక, పరుగు, సైక్లింగ్ లేదా ఈత వంటి వ్యాయామం చేయడం వల్ల మీ శరీరం ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అధిక బరువు పెరగడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.. కాబట్టి మీ బరువును నియంత్రించుకోండి.

ఒత్తిడిని తగ్గించుకోండి
ఇది కాకుండా, మీ ఒత్తిడిని తగ్గించుకోండి. రోజూ యోగా, ధ్యానం చేయండి. ఇది మీ శరీరంలో ఒత్తిడి హార్మోన్ల స్థాయిని తగ్గిస్తుంది.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

వైద్య పరీక్షలు..
మీ రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. దీనితో మీరు డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మీ వైద్యునితో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరపడం, వారు ఇచ్చిన సలహాలను పాటించడం కూడా ముఖ్యమని నిపుణులు అంటున్నారు.