Instant Wheat Idli : ఇడ్లీలను సాధారణంగా చాలా మంది తరచూ చేస్తుంటారు. తేలిగ్గా జీర్ణమయ్యే ఉత్తమమైన బ్రేక్‌ఫాస్ట్‌లలో ఇడ్లీలు కూడా ఒకటి.
అయితే ఇడ్లీల్లో తెల్ల రవ్వ కలుపుతారు. కనుక అది అందరికీ మంచిది కాదు. కానీ గోధుమ రవ్వను వేసి కూడా ఇడ్లీలను తయారు చేయవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉండడమే కాదు.. ఆరోగ్యకరం కూడా. గోధుమ రవ్వతో ఇడ్లీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమ రవ్వ ఇడ్లీల తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమ రవ్వ – ఒక కప్పు, పెరుగు – ముప్పావు కప్పు, క్యారెట్ తురుము – పావు కప్పు, పచ్చి మిర్చి తరుగు – ఒక టీస్పూన్, ఆవాలు – అర టీస్పూన్, జీలకర్ర – అర టీస్పూన్, నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు, కరివేపాకు రెబ్బలు – రెండు, జీడిపప్పు – పలుకులు కొన్ని, శనగ పప్పు – ఒక టీస్పూన్, ఉప్పు – తగినంత.
గోధుమ రవ్వ ఇడ్లీలను తయారు చేసే విధానం..
స్టవ్ మీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడి అయిన తరువాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, జీడిపప్పు పలుకులు, కరివేపాకు రెబ్బలు వేయాలి. ఇవన్నీ వేగాక గోధుమ రవ్వను కూడా వేసి దోరగా వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెరుగులో వేసి బాగా కలపాలి. ఇందులో తగినంత ఉప్పు, క్యారెట్ తురుము, పచ్చి మిర్చి తురుము వేసి బాగా కలిపి మూత పెట్టాలి. అరగంటయ్యాక ఇడ్లీ పిండిలా అయ్యేందుకు మరికాసిని నీళ్లు కలిపి 5 నిమిషాలు నానబెట్టాలి. ఇప్పుడు ఇడ్లీ రేకులకు నూనె లేదా నెయ్యి రాసి వాటిల్లో ఈ పిండిని వేసి ఆవిరి మీద పావు గంట లేదా 20 నిమిషాల పాటు ఉడికించి తీయాలి. దీంతో వేడి వేడి రుచికరమైన గోధుమ రవ్వ ఇడ్లీలు రెడీ అవుతాయి. వీటిని ఏ చట్నీతో అయినా లేదా సాంబార్‌తో అయినా కలిపి తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా అందిస్తాయి.