Hyderabad: ‘యూ బెగ్గర్‌’ అని అవమానించేవారు.. అందుకే తాతయ్యను చంపేశా: కీర్తితేజ

నగరంలో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త చంద్రశేఖర్‌ జనార్దనరావు హత్యకేసులో నిందితుడు కిలారు కీర్తితేజను ఐదు రోజుల పాటు విచారించిన పోలీసులు కీలక వివరాలు రాబట్టారు.


హైదరాబాద్‌: ఆస్తి తగాదాల నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్‌ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర(వీసీ) జనార్దనరావు (86) తన మనవడి చేతిలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు కిలారు కీర్తితేజను ఐదు రోజుల పాటు విచారించిన పోలీసులు కీలక వివరాలు రాబట్టారు. హత్య జరిగిన మరుసటిరోజే నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మరింత సమాచారం సేకరించేందుకు పంజాగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకొని నిందితుడి నుంచి వాంగ్మూలం సేకరించారు. మొదటిరోజు పోలీసులకు సహకరించకుండా వింతచూపులు చూస్తూ తనలో తాను మాట్లాడినా.. ఆ తర్వాత హత్యకు దారితీసిన పరిస్థితులను పోలీసు అధికారుల ఎదుట వివరించినట్టు సమాచారం.

కస్టడీలో కీర్తితేజ చెప్పిన విషయాలు…

‘‘యూ బెగ్గర్‌ అంటూ ప్రతిరోజూ తాత అవమానించేవారు. ఏ రోజూ నన్ను సొంత మనిషిగా చూడలేదు. కుటుంబ సభ్యుడిగా కూడా చూడలేదు. అందరి కంటే హీనంగా చూస్తూ దారుణంగా వ్యవహరించేవాడు. ప్రతిరోజూ నన్ను బెగ్గర్‌ అంటూ పిలిచేవాడు. ఆఫీసుకు వెళ్తే అక్కడ కూడా అవమానించేవాడు. తాత అలా తిట్టడం వల్ల ఆఫీస్ స్టాఫ్‌ కూడా నన్ను చిన్నచూపు చూసేవారు. ఆస్తి పంపకాలు, పదవుల కేటాయింపుల్లోనూ తక్కువ చేశారు. చివరకు డైరెక్టర్‌ పదవి కూడా నాకు ఇవ్వలేదు. అప్పటి నుంచి నాకు, తాతకు మధ్య గొడవలు పెరిగాయి. అందుకే చంపేయాలని నిర్ణయించుకున్నా. ఇన్‌స్టామార్ట్‌ నుంచి కత్తి కొనుగోలు చేశా. హత్య జరిగిన రోజు నాకు, తాతకు మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఆస్తిలో వాటా కావాలని అడిగితే ఇవ్వను అన్నాడు. కోపంతో కత్తితో కసితీరా పొడిచా. హత్య చేసిన తర్వాత బీఎస్‌ మక్తా ఎల్లమ్మగూడ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో కత్తి, రక్తంతో ఉన్న నా బట్టలను తగలబెట్టా’’ అని కీర్తి తేజ చెప్పినట్టు సమాచారం.