అన్నం మిగిలిందా? – కరకరలాడే “మురుకులు” చేయండి! – నూనె కూడా తక్కువే

 అందరి ఇళ్లలో మధ్యాహ్నం, రాత్రి వండిన రైస్ మిగిలిపోతుంటుంది. దాంతో చాలా మంది మిగిలిన అన్నం పడేయడం ఇష్టం లేక రకరకాల టిఫెన్స్, స్నాక్ రెసిపీలు ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే, ఈసారి ప్రతిసారీ చేసుకునేవి కాకుండా ఇలా కరకరలాడే “మురుకులు” ట్రై చేయండి.


ఇవి నార్మల్​గా చేసుకునే వాటితో పోల్చితే సరికొత్తగా, భలే రుచికరంగా ఉంటాయి. అలాగే, వీటి తయారీకి ఎక్కువ శ్రమించాల్సిన పని లేదు. అన్నంతో చేసుకునే ఈ మురుకులు నూనెను కూడా అంతగా పీల్చుకోవు! మరి, మిగిలిన అన్నంతో ఈ క్రిస్పీ అండ్ టేస్టీ మురుకులను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • అన్నం – రెండు కప్పులు
  • శనగపిండి – ఒక కప్పు
  • బియ్యప్పిండి – ఒక కప్పు
  • నువ్వులు – రెండు టేబుల్​స్పూన్లు
  • వాము – ఒక టీస్పూన్
  • కారం – రెండు టీస్పూన్లు
  • పసుపు – అరటీస్పూన్
  • ఉప్పు – రుచికి తగినంత
  • బటర్ – రెండు టేబుల్​స్పూన్లు
  • నూనె – వేయించడానికి సరిపడా
  • తయారీ విధానం :

    • ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో విడతల వారీగా కొద్ది కొద్దిగా అన్నం వేసుకుంటూ వాటర్ వేయకుండా మధ్యమధ్యలో మూత తీసి కలుపుతూ మిక్సీ పట్టుకోవాలి.
    • అలా అన్నం మొత్తాన్ని గ్రైండ్ చేసుకుని ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్​లోకి తీసుకోవాలి.
    • తర్వాత అందులో శనగపిండి, బియ్యప్పిండి, తెల్ల నువ్వులు, వాము, కారం, పసుపు, రుచికి తగినంత ఉప్పు, బటర్ వేసుకుని పదార్థాలన్నీ చక్కగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
    • ఇలా కలిపేటప్పుడు కూడా వాటర్ ఏమీ వేయకుండా అన్నంలోని తడితోనే పిండిని కలుపుకోవాలి.
    • ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా కలిపిన తర్వాత పిండి మిశ్రమాన్ని చేతి మణికట్టుతో బాగా ప్రెస్ చేస్తూ అన్నం ఎక్కడైనా గ్రైండ్ కాకుండా ఉంటే అదీ పిండిలో కలిసేలా బాగా కలిపి పక్కనుంచాలి.
    • అనంతరం జంతికల గొట్టంలో స్టార్ షేప్(నక్షత్రాకారపు) బిళ్లను సెట్ చేసుకుని కొద్దిగా నూనెను రాసుకోవాలి.
    • తర్వాత అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని సరిపడా నింపి బటర్ పేపర్ లేదా క్లాత్​పై మురుకుల్లా వత్తుకోవాలి. అలా పిండి మొత్తాన్ని రెడీ చేసుకుని పక్కనుంచాలి.
    • ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ మీడియంగా హీట్ అయ్యాక అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జంతికలను తగినన్ని వేసి లో-ఫ్లేమ్​లో వేయించుకోవాలి.
    • అవి కాస్త వేగిన తర్వాత రెండు వైపులా గరిటెతో తిప్పేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించాలి.
    • ఆ విధంగా వేయించుకున్నాక వాటిని బయటకు తీసి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, మిగిలిన అన్నంతో కరకరలాడే “జంతికలు” అప్పటికప్పుడు రెడీ అవుతాయి!

    టిప్స్ :

    • ఈ రెసిపీని మిగిలిపోయి అన్నంతో మాత్రమే కాకుండా అప్పుడే వండిన రైస్​తో కూడా రెడీ చేసుకోవచ్చు.
    • అలాగే, రైస్​ను మిక్సీ పట్టుకునేటప్పుడు మరీ అవసరమనిపిస్తే ఒకట్రెండు టీస్పూన్లు వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి.
    • ఒకవేళ మీ వద్ద బటర్ లేనట్లయితే దాని ప్లేస్​లో కొద్దిగా వేడి నూనె లేదా నెయ్యిని యాడ్ చేసుకుని పిండిని కలుపుకోవచ్చు.
    • అదేవిధంగా పిండిని కలిపేటప్పుడు తడి ఎక్కువగా అనిపిస్తే సమాన పరిమాణంలో మరికొద్దిగా బియ్యప్పిండి, శనగపిండిని యాడ్ చేసి కలుపుకోవాలి.
    • ఈ మురుకులను సన్నని మంటపై ఎంత బాగా వేయిస్తే అంత కరకరలాడుతూ, టేస్టీగా వస్తాయని గుర్తుంచుకోవాలి.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.