సాధారణంగా ఓ స్టార్ హీరో సినిమాలు మరో హీరో అతిథి పాత్రలో కనిపించడం సర్వ సాధారణం. ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతుంది. అంతేకాదు.. ఇతర భాషలలోని అగ్ర హీరోలు మరో ఇండస్ట్రీలోని స్టార్స్ సినిమాల్లో గెస్ట్ రోల్స్ పోషిస్తున్నారు. కానీ ఇప్పుడు ఓ నటుడు మాత్రం పది నిమిషాలకు రూ.22 కోట్లు తీసుకుంటున్నారట.
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఏడు పదుల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ తర్వాత రజినీ జైలర్ 2 చిత్రంలో నటించనున్నారు. గతంలో సూపర్ హిట్ అయిన జైలర్ చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ మూవీపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ హై ఆక్టేన్ యాక్షన్ సినిమాలో పలువురు స్టార్స్ సైతం అతిథి పాత్రలలో కనిపించనున్నారట. ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారని సమాచారం. రజినీ, శివరాజ్ కుమార్ కాంబోలో వచ్చే సీన్స్ హైలెట్ కానున్నాయని టాక్.
ఇదంతా పక్కన పెడితే జైలర్ 2 చిత్రంలో మరో స్టార్ హీరో అతిథి పాత్రలో కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. ఆయన మరెవరో కాదు.. టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ. జైలర్ 2 చిత్రంలో కేవలం పది నిమిషాల నిడివి ఉన్న పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారట. అయితే ఈ సినిమా కోసం ఆయనకు రూ.22 కోట్లు పారితోషికం ఇవ్వనున్నారని ఫిల్మ్ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. కేవలం 10 నిమిషాల పాత్ర కోసం ఆస్థాయిలో రెమ్యునరేషన్ తీసుకునే ఏకైక స్టార్ హీరోగా బాలకృష్ణ రికార్డ్ సృష్టించారు. చాలా సంవత్సరాల తర్వాత రజినీ, బాలయ్య ఒకే సినిమాలో నటిస్తుండడంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
వీరసింహారెడ్డి, డాకు మహారాజ్ వంటి చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్నారు బాలయ్య. ప్రస్తుతం అఖండ 2 చిత్రంలో నటిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. మరోవైపు జైలర్ 2 చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. అలాగే రజినీ, బాలయ్య మధ్య వచ్చే సీన్స్ సినిమాకు హైలెట్ కానున్నాయని.. వీరిద్దరి సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయని అంటున్నారు.