తమిళనాడు రాష్ట్రం తంజావూరు నగరం నుంచి 26 కి.మీ. దూరంలో అమ్మపేట గ్రామంలో తిరువెన్ని ఆలయం ఉంది. ఇక్కడ లింగ రూపంలో ఉండే శివుడు వెన్ని కరుంబేశ్వరర్‌గా, పార్వతిదేవి సుందరి నాయకిగా పూజలందుకుంటున్నారు.
ఇది స్వయంభూ దేవాలయం. పూర్వం ఈ ప్రదేశం చెరకు (కరుంబు), వెన్ని (నందివర్ధనం) చెట్లతో నిండి ఉండేదట. అందుకే ఈ స్వామిని వెన్ని కరుంబేశ్వరర్ అని పిలుస్తారన్నది స్థానికుల కథనం. చేతిలో చెరకుముక్కను పట్టుకుని ఉన్న శివుడి ప్రతిమ ఆలయంపై దర్శనమిస్తుంది.
ఈ స్వామిని దర్శించుకుంటే మధుమేహ వ్యాధి నయమైపోతుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఆ నమ్మకంతోనే దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ ఆలయానికి వెళ్లి స్వామికి గోధుమరవ్వ, చక్కెరతో చేసిన మిఠాయిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ ప్రసాదంలో కొంత భాగాన్ని చీమల కోసం పెడతారు. అవి గనుక ప్రసాదాన్ని తింటే తమ వ్యాధి తగ్గుతుందని నమ్ముతారు. ఇది శ్రీకృష్ణుడు ప్రతిష్టించిన శివలింగమని, ఎంతో మహిమాన్వితమని భక్తులు నమ్ముతారు. విదేశీయులు సైతం మధుమేహ వ్యాధి నివారణ కోసం ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు.