Jagan: పులివెందులలో గుట్టుగా వైసీపీ శ్రేణుల కొనుగోలు

www.mannamweb.com


రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్నారు. తద్వారా విజయం దక్కుతుందని ఆశాభావంతో ఉన్నారు.
నిన్నటి నుంచి ఎన్నికల ప్రచార సభలను ప్రారంభించారు. సిద్ధం పేరుతో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. వై నాట్ 175 అన్న నినాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. అయితే సరిగ్గా ఇదే సమయంలో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో పులివెందులలో షర్మిల పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే జగన్ కు ఇబ్బందికర పరిస్థితులు తప్పవని తెలుస్తోంది. ఆయనకు ఓటమి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని ఓ సర్వేలో తేలినట్లు సమాచారం. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సర్వేలు చేపట్టారు. అదే అనుభవంతో పులివెందులలో సర్వే చేయగా జగన్ కు ఇబ్బందులు తప్పవని తేలినట్లు తెలుస్తోంది. అందుకే జగన్ పులివెందులపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం.
ప్రస్తుతం పులివెందుల నియోజకవర్గ బాధ్యతలను ఎంపీ అవినాష్ రెడ్డి చూస్తున్నారు. ఆయన సారధ్యంలో ‘కార్యకర్తకు జగనన్న భరోసా’ పేరుతో ఒక కార్యక్రమం ప్రారంభమైంది. అయితే ఇదేదో ప్రభుత్వ కార్యక్రమం అనుకుంటే పొరపడినట్టే. ఇది అచ్చం సొంత పార్టీ నాయకులను కొనుగోలు చేసే ప్రయత్నమని టాక్ నడుస్తోంది . గత కొద్దిరోజులుగా నాయకులు, కార్యకర్తలు అసంతృప్తిగా ఉండడాన్ని గుర్తించిన వైసీపీ హై కమాండ్.. వారిని మచ్చిక చేసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ప్రచారం జరుగుతోంది. నేరుగా కాకుండా జగనన్న భరోసా పేరుతో వారితో దరఖాస్తులు తీసుకుని.. రూ.50 వేల నుంచి రూ.15 లక్షల వరకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది .ఎంపీ అవినాష్ రెడ్డి స్వయంగా కార్యకర్తలు, నాయకులకు నగదు పంపిణీ చేయిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో వైసిపి మద్దతుగా గట్టిగా పని చేయాలని సూచిస్తున్నారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
పులివెందుల వైఎస్ కుటుంబానికి పెట్టని కోట. గత ఐదు దశాబ్దాలుగా ఆ కుటుంబానికి అండగా నిలబడుతూ వస్తోంది. ఇప్పుడు కుటుంబంలో చీలిక రావడం, గత ఐదు సంవత్సరాలుగా మెజార్టీ కార్యకర్తలను జగన్ కలవకపోవడం, గ్రామాల్లో అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించకపోవడం వంటి కారణాలతో నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ముఖ్యంగా నియోజకవర్గంలోని తొండూరు, వేముల, వేంపల్లె,పులివెందుల, లింగాల మండలాల్లో మెజారిటీ క్యాడర్ అసంతృప్తితో ఉంది. గత ఐదు సంవత్సరాలుగా తమకు ఏ ప్రయోజనం దక్కలేదని వారు బాధతో ఉన్నారు. పార్టీ కోసం గట్టిగా పని చేయడం లేదు. మరోవైపు బీటెక్ రవి రూపంలో తెలుగుదేశం పార్టీ పట్టు బిగిస్తోంది. ఇటీవల పులివెందులలో సైతం గెలుస్తామని టిడిపి గట్టిగానే చెబుతోంది. ఈ పరిణామాల క్రమంలో వైసిపి భయపడుతోంది. షర్మిల కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే.. ఆ చీలికతో తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తోంది. అందుకే వైసిపి ఓటు బ్యాంకు సడలకుండా ఉండడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలకు నగదు రూపంలో అండగా నిలిచేందుకు నేరుగా రంగంలోకి దిగింది.

వైసిపి నాయకులు, కార్యకర్తలు స్థాయి, వారు ఎన్నికల్లో ప్రభావితం చేసే తీరును అంచనా వేసి రూ.50 వేల నుంచి రూ.15 లక్షల వరకు పంచుతున్నట్లు తెలుస్తోంది. కార్యకర్తకు రూ.50 వేలు, పంచాయతీ పరిధిలో ఓటర్లను ప్రభావితం చేయగల నాయకుడికి రూ.2 లక్షలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఆ స్థాయి నాయకులకు రూ.5 లక్షలు, నియోజకవర్గ స్థాయి నాయకులకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు అందిస్తున్నట్లు సమాచారం. అయితే తాము కష్టాల్లో ఉన్నామని.. తమను ఆదుకోవాలని ఓ దరఖాస్తును వారి నుంచి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ నగదును అందిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. మొత్తానికైతే పులివెందులలో ఈ కొత్త తాయిలాలు రకరకాల ఊహాగానాలకు కారణమవుతున్నాయి.