ప్రమాదంలో జగన్ ? ఎవరిని నమ్మాలో తెలియట్లేదు-లండన్ లో ఏఏజీ పొన్నవోలు కంటతడి..!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత సీఎం జగన్ కుటుంబ సమేతంగా యూరప్ పర్యటనకు వెళ్లిపోయారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎలా జరిగాయన్న దానిపై ఐప్యాక్ టీమ్ తో భేటీలో అంతకుముందే జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.


గతంలో గెలిచిన 151 సీట్ల కంటే ఈసారి ఎక్కువగా గెలువబోతున్నట్లు జగన్ వారికి తెలిపారు. దీంతో వైసీపీ నేతలు, క్యాడర్ కూడా జగన్ పై ఉన్న నమ్మకంతో ధీమాగా కనిపిస్తున్నారు.

ఇలాంటి సమయంలో జగన్ కు నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్న అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లండన్ లో వైసీపీ ఎన్నారై నేతలతో భేటీలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. వైసీపీ ఎన్నారై నేతలను ఉద్దేశించి మాట్లాడిన అదనపు ఏజీ పొన్నవోలు ఓ దశలో కన్నీటి పర్యంతం అయ్యారు. చివరికి సదరు నేతలు ఆయనకు సర్దిచెప్పారు. దీంతో తిరిగి మాట్లాడారు. ఎన్నికల్లో తమకు అండగా నిలిచినందుకు త్వరలో కలిసి విందు చేసుకొందామని చెప్పి ఈ భేటీ ముగించారు. అయితే ఈ వ్యాఖ్యల సందర్భం ఏంటో మాత్రం వివరించలేదు.

వైసీపీ ఎన్నారై నేతలతో మాట్లాడుతూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి జగన్ ప్రమాదంలో ఉన్నారని, ఆయన్ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అంతే కాదు ఎవరిని నమ్మాలో తెలియడం లేదంటూ మరో కీలక వ్యాఖ్య చేశారు. అనంతరం కంటతడి పెట్టేసారు. ఒక్క జగగన్న కోసం కాదని, పేదోళ్ల కోసం ఆయన్ను కాపాడుకోవాలన్నారు. ఆయన కష్టం తనకు తెలుసని, ఆయన ప్రమాదంలో ఉన్నారని తెలిపారు. జగన్ వినే వారు కాదని, ఏదైతే అది అవుతుందని అనుకునే వారన్నారు. మనల్ని పలకరించారా లేదా అన్నది కూడా వదిలేయాలని, ఆయన్ను కాపాడుకోవడం ఒక్కటే మన మోటివ్ అన్నారు.