‘వరుసగా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే జగన్‌పై అనర్హత వేటు!’

శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు


ఈనాడు, దిల్లీ: జగన్‌ అయినా.. మరే ఎమ్మెల్యే అయినా.. సహేతుక కారణంతో సెలవు కోసం దరఖాస్తు చేయకుండా వరుసగా 60 రోజులు అసెంబ్లీకి గైర్హాజరైతే వారు చట్ట ప్రకారం అనర్హతకు గురవుతారని శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

రాష్ట్రంలో మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఈ నెలలో నిర్వహించబోయే శిక్షణ తరగతుల కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాను ఆహ్వానించేందుకు దిల్లీకి వచ్చిన ఆయన సోమవారం ఏపీ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. సభకు గైర్హాజరవుతున్న వైకాపా అధ్యక్షుడు జగన్‌ గురించి విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు.

‘జగన్‌ గత అయిదేళ్లలో ముందుగా రికార్డు చేసిన ప్రెస్‌మీట్లు తప్పితే నేరుగా మీడియాను కలిసిన పాపాన పోలేదు. కానీ, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు మీడియా ముందు కొంత ఎక్కువగా కనిపిస్తున్నారు. ఒక శాసన సభ్యుడిగా అసెంబ్లీకి వచ్చి తన భావాలను వ్యక్తపరిస్తే ఆయనకు గౌరవంగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇవ్వని గౌరవం కోసం మంకుపట్టు పడితే ఫలితం ఉండదు. మొత్తం సభ్యుల్లో 10% బలం ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న సంప్రదాయాన్ని 1952 నుంచి అనుసరిస్తున్నారు. ఇది ఆయనకూ తెలుసు. వరుసగా శాసనసభకు గైర్హాజరయ్యే వారిపై చర్యలు తీసుకోవడానికి చట్టంలోని నిబంధనలు అవకాశం కల్పిస్తున్నాయి. 60 రోజుల వ్యవధిలో సెలవుకు దరఖాస్తు చేస్తే పరిశీలిస్తారు. లేకుంటే 60 రోజులు దాటిన తర్వాత ఆయన ఆటోమేటిక్‌గా ఎమ్మెల్యేగా అనర్హుడవుతారు. పులివెందులకు ఉప ఎన్నిక వస్తుంది’ అని వెల్లడించారు. సభకు రాకుండా రిజిష్టర్‌లో సంతకం పెట్టి వెళ్లిపోవచ్చు కదా? అన్న ప్రశ్నకు రఘురామ అవునని సమాధానం ఇచ్చారు. అది తన సీటు నిలబెట్టుకోవడానికి పనికొస్తుందే తప్ప, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభకు రాను అన్న మాటకు విలువ ఉండదని చెప్పారు.