Amaravati: జగన్‌ కక్ష తీరింది.. చేపల వేటే మిగిలింది

ఆ ఎగురుతున్నవి రెండూ రాగండి… పొడుగ్గా ఉన్నది గడ్డిమోసు.. ఇది బొచ్చె.. ఇలా చేపలు పడుతున్నవాళ్లు, కొనుక్కోవడానికి వచ్చినవాళ్లతో ఆ ప్రాంతమంతా హడావుడిగా ఉంది. ఈ సందడంతా చేపల పెంపకానికి ప్రసిద్ధి చెందిన ఏ భీమవరం ప్రాంతంలోని చెరువు ఒడ్డునో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇదంతా ఘనత వహించిన గత జగన్‌ ప్రభుత్వం రాజధాని అమరావతిలో సాధించిన ‘అద్భుతం’..! అసలు చేపల చెరువులే లేని అమరావతిలో ఏకంగా ఆరు నుంచి ఏడు కిలోల వరకు బరువున్న చేపలను పెంచిన ఘనత గత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుంది. రాజధాని అమరావతి విధ్వంసమే లక్ష్యంగా ఐదేళ్లపాటు ఎక్కడి పనుల్ని అక్కడే నిలిపివేసి ఆ ప్రాంతం మొత్తాన్ని జగన్‌ ప్రభుత్వం అడవిలా మార్చేసింది.


చేపలు పడుతున్న స్థానికులు

ఇక సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం తలపెట్టిన ఐదు ఐకానిక్‌ టవర్లు, హైకోర్టు భవనాల పునాదుల కోసం తవ్విన భారీ గుంతల్లో వర్షపు నీరు చేరి అవి లోతైన, పెద్ద తటాకాల్లా మారాయి. గత ఐదేళ్లూ అన్ని కాలాల్లోనూ అవి నీటితో నిండే ఉండటంతో చేపల ఆవాసాలుగా మారాయి. తాజాగా ఎన్డీయే ప్రభుత్వం రాజధాని పనులను పునఃప్రారంభించే క్రమంలో ఆ గుంతల్లోని నీటిని కొన్ని వారాలుగా భారీ మోటార్లతో ఎత్తిపోస్తోంది. వాటిలో చేపలున్నాయని తెలియడంతో మత్స్యకారులు, కొందరు వ్యాపారులు వచ్చి పట్టుకుని అమ్ముకుంటున్నారు. సుమారు 500 కిలోల వరకు చేపలు పట్టుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. వాటిని విజయవాడ తదితర మార్కెట్లకు తరలించారు.

చిక్కిన చేపలు

ఐకానిక్‌ టవర్‌ గుంతల వద్ద కోలాహలంగా చేపల విక్రయాలు