కౌరవుల సభకు వెళ్లాల్సి ఉంటుంది.. అసెంబ్లీకి వెళ్లడంపై జగన్ కీలక వ్యాఖ్యలు

ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయని ఏపీ మాజీ సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలో గురువారం వైసీపీ నేతల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని జగన్ మాట్లాడారు.


ఇలాంటి ఫలితాలు చూసిన తర్వాత బాధ కలిగిందన్నారు. ఫలితాలు చూసిన తర్వాత శకుని పాచికల కథ గుర్తొచ్చిందన్నారు. శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయని తెలిపారు. కానీ ఆధారాలు లేకుండా మాట్లాడలేమన్నారు. అయినా వైసీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయన్న విషయం మరచిపోవద్దని నాయకులకు భరోసా కల్పించారు. 2019తో పోలిస్తే 10 శాతం ఓట్లు మాత్రమే తగ్గాయన్నారు. చంద్రబాబు మోసాలను, ప్రలోభాలను ప్రజలు గుర్తిస్తారన్నారు. 2029లో వైసీపీని ప్రజలే అధికారంలోకి తెచ్చుకుంటారన్నారు.

జగన్‌కు వయసుతో పాటు సత్తువ కూడా ఉందన్నారు. ప్రజలతో కలిసి చేసే పోరాటాల్లో నాతో ఎవరూ సాటిరారన్నారు. కౌరవులు ఉండే సభకు మనం వెళ్లాల్సి ఉంటుందని అసెంబ్లీని ఉద్దేశించి అన్నారు. అసెంబ్లీలో మనం ఏదో చేస్తామనే నమ్మకం లేదని.. అందుకే ప్రజలకు చేరువై పోరాటాలు చేద్దామన్నారు. టీడీపీకి ఓటు వేయలేదని దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. రెడ్ బుక్స్ అంటూ హోర్డింగ్‌లు పెడుతున్నారన్నారు. ఓడిపోయామన్న భావన మనసులో నుంచి తీసేయాలని నేతలకు సూచించారు. న్యాయంగా, ధర్మంగా మనం ఓడిపోలేదన్నారు. కార్యకర్తలకు ఎప్పుడు తోడుగా ఉండాలని సూచించారు. దాడులకు గురైన వారికి భరోసా ఇవ్వాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో తాను కార్యకర్తలను కలుస్తా అని జగన్ తెలిపారు.