ఇష్టంతో కష్టపడి చదివా.. నా టార్గెట్‌ అదే: జేఈఈ (మెయిన్‌) టాపర్‌ సాయి మనోజ్ఞ

జేఈఈ (మెయిన్‌) ఫలితాల్లో తెలుగమ్మాయి సాయి మనోజ్ఞ గుత్తికొండ సత్తా చాటారు. జాతీయ స్థాయిలో ఈసారి కేవలం 14మందికి మాత్రమే 100 పర్సంటైల్‌ రాగా..


వారిలో ఏకైక అమ్మాయి గుంటూరుకు చెందిన సాయి మనోజ్ఞ ఉండటం విశేషం. JEE Main 2025 మొదటి సెషన్‌ ఫలితాల్లో 100 పర్సంటైల్‌ సాధించి ఆమె అందరి ప్రశంసలు అందుకొంటున్నారు. ఇంత గొప్ప విజయం తనకు ఎలా సాధ్యమైంది? ఎలా ప్రిపేర్‌ అయ్యారు? ఇంజినీరింగ్‌లో ఏ కోర్సు తీసుకోవాలనుకుంటున్నారో ఆమె మాటల్లోనే..!

ఈ విజయం ఎలా సాధ్యమైంది?

నేను గుంటూరులోనే ఇంటర్‌ చదువుతున్నా. లెక్చరర్లు చెప్పిందే ఫాలో అయ్యాను. మంచి కరికులమ్‌, అధ్యాపకుల సపోర్టు బాగుండేది. ఇష్టంతో కష్టపడి చదవడం వల్లే ఈ విజయం సాధ్యమైంది.

జేఈఈ మెయిన్‌ ఫలితాలు వచ్చేశాయ్‌..
మీ ప్రిపరేషన్‌ ఎలా ఉండేది?

కాలేజీలో రోజూ టైం టేబుల్‌ ఉంటుంది. దాని ప్రకారమే చదివాను. వారంలో పర్టిక్యులర్‌ టాపిక్స్‌ ఇచ్చి.. వాటిపై సలహాలు ఇచ్చేవారు. ఆ ప్రకారమే ప్లాన్‌ చేసుకొని చదువుకున్నా. ఇచ్చిన టార్గెట్స్‌ని పూర్తి చేయడానికి ప్రయత్నించేదాన్ని.

మీకు పేపర్‌ ఎలా అనిపించింది?

జనవరి 23న నేను పరీక్ష రాశాను. నా షిఫ్టు పేపర్‌ చాలా ఈజీగానే ఉందనిపించింది. మాకు కాలేజీలో గ్రాండ్‌ టెస్ట్‌ల లెవెల్‌ కన్నా మెయిన్స్‌లో కష్టం తక్కువగానే ఉందనిపించింది. ఆ కాన్ఫిడెన్స్‌తో రాశాను. నాకు టైం సరిపోయింది. గంటలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ అయిపోవడంతో, 1.20గంటలు మ్యాథ్స్‌కు ఇచ్చేసి.. చివరి 40 నిమిషాలు చెకింగ్ చేసుకున్నాను.

బీటెక్‌ ఎక్కడ, ఏ కోర్సులో చేరాలనుకొంటున్నారు?

ఏదైనా మంచి ఐఐటీలో చేరాలని అనుకొంటున్నా. ఈసీఈ(ECE) బ్రాంచ్‌ తీసుకోవాలనుకుంటున్నాను. నాకు ఆ సబ్జెక్టుపైనే ఆసక్తి ఉంది. కష్టపడి మంచి స్థాయికి వెళ్లాలనేది నా లక్ష్యం. నాకు వచ్చిన ర్యాంకును బట్టి ఏదైనా మంచి ఐఐటీ చేరతాను.