ప్రియుడి దారుణ హత్య
సహజీవనం చేస్తున్న ప్రియురాలి ఘాతుకం
ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్న ప్రియురాలి తప్పటడుగు ప్రియుడు హత్యకు దారి తీసింది.
ఈ ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు, రావులపాలేనికి చెందిన మునిస్వామి లావణ్యకు కొన్నేళ్ల క్రితం చిత్తూరుకు చెందిన బాలుతో వివాహమైంది. మనస్పర్ధల కారణంగా ఇద్దరూ విడిపోగా నాలుగేళ్ల క్రితం రావులపాలెంలోనే గుడాల చంద్రశేఖర్‌స్వామి(30) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం సహజీవనానికి దారి తీసింది.
వీరి బంధం ఇలా కొనసాగుతుండగా, రెండు నెలల క్రితం లావణ్యకు కాకినాడకు చెందిన ఆర్‌టీసీ డ్రైవర్ లోవరాజుతో పరిచయం ఏర్పడింది. అతడి పరిచయంతో లావణ్య తన మొదటి ప్రియుడు చంద్రశేఖర్‌ను వదిలేసి కాకినాడకు లోవరాజుతో కలిసి వచ్చేసింది. రెండు నెలల క్రితం లోవరాజు తన ప్రియురాలిని కాకినాడ డైరీఫారం సమీపంలో ఉన్న టిడ్కో ఇళ్లలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఉంచాడు. ఇదిలా ఉంటే చంద్రశేఖర్ తన ప్రియురాలు లావణ్య జాడ తెలుసుకొని బుధవారం రాత్రి ఇంటికి వచ్చాడు.
అర్ధరాత్రి ఇంట్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా లావణ్య చంద్రశేఖర్‌ను ఇంట్లో ఉన్న పప్పుగుద్దు, ఇనుప సన్నిరాయితో తలపై మోదింది. ఈ ఘటనలో చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. నిందితురాలు లావణ్య పరారీలో ఉండగా హత్యలో లోవరాజు పాత్రపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాకినాడ పోర్ట్ పోలీస్‌స్టేషన్‌లో హత్యా ఘటనపై కేసు నమోదైంది.