Sri Lakshmi Srinivasa Constructions : నిర్వాహకురాలి అరెస్ట్‌

దేశం విడిచి పారిపోయేందుకు యత్నం


ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకున్న పోలీసులు

దుండిగల్‌: నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టడమేగాక, వినియోగదారులను మోసం చేసి రూ.కోట్లు సంపాదించింది.

పోలీసు కేసులు నమోదు కావడంతో దేశం విడిచి పారిపోయేందుకు యత్నించిన ఓ నిర్మాణ సంస్థ యజమానురాలిని దుండిగల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధిలో మల్లంపేటలోని సర్వే నెంబర్‌ 170/3, 170/4, 170/5లోని 15 ఎకరాల భూమిని పాతికేళ్ల క్రితం ముగ్గురు స్వాతంత్ర సమరయోధులకు అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఆ తర్వాత సదరు భూమి పలువురి చేతులు మారి చివరికి కొన్నేళ్ల క్రితం శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌ సంస్థకు చేరింది.

సంస్థ నిర్వాహకురాలు గుర్రం విజయలక్ష్మి ఐదేళ్ల క్రితం 3.20 ఎకరాల్లో 65 విల్లాల నిర్మాణం కోసం హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేసుకుంది. ఆ తర్వాత సదరు సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండానే పక్కనే ఉన్న కత్వ చెరువుకు సంబంధించిన 16 గుంటల ఎఫ్‌టీఎల్, మూడు ఎకరాల బఫర్‌ జోన్‌ను ఆక్రమించి ఏకంగా 300కు పైగా విల్లాలను నిరి్మంచింది. దీనిపై స్థానికులు పలుమార్లు మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.

బఫర్‌ జోన్, ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని 11 అక్రమ విల్లాలను గత సెప్టెంబరులో అధికారులు కూల్చివేశారు. అంతేగాక ఇరిగేషన్‌ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారని దుండిగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి తోడు తమకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పి మోసం చేశారని, రిజి్రస్టేషన్లు సైతం చేసుకుని బ్యాంకుల్లో రుణాల్లో తీసుకుని రూ. లక్షలు వెచ్చించి ప్లాట్లను కొనుగోలు చేశామని, చివరికి తమ విల్లాలను కూల్చివేశారని, సంస్థ నిర్వాహకురాలు గుర్రం విజయలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని బాధితులు దుండిగల్‌ పోలీసులను ఆశ్రయించారు.

విజయలక్ష్మిపై ఇప్పటి వరకు ఏడు కేసులు నమోదు చేసిన పోలీసులు లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు. కాగా గురువారం తెల్లవారుజామున దేశం విడిచి పారిపోయేందుకు ప్రయతి్నంచిన ఆమెను శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని దుండిగల్‌ పోలీసులకు అప్పగించారు. వారు ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరు పరచడంతో 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు.