KCR Family: చరిత్రలో తొలిసారి ఎన్నికలకు దూరంగా కేసీఆర్ ఫ్యామిలీ.. కారణం అదేనా!

www.mannamweb.com


తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 23 ఏళ్ల క్రితం ఉపిరి పోసుకున్న ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. మారిన రాజకీయ పరిణామాలతో దేశవ్యాప్తంగా విస్తరించాలని ప్రస్తుత బీఆర్ఎస్‌గా మారింది.
రాజకీయాలే పరమావధిగా అవిర్భవించిన పార్టీ చరిత్రలో తొలిసారిగా పార్టీ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉంటోంది.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అతని కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు 2004 నుండి ప్రతి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీ రామారావు, కేసీఆర్ మేనల్లుడు టి.హరీష్ రావుల్లో ఎవరో ఒకరు ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఆ ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా ఎన్నికల బరిలోకి దిగలేదు. గతంలో ఎంపీగా గెలిచిన కవిత లిక్కర్ స్కామ్ కేసుతో ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో ఓడిపోయిన కేసీఆర్ కుమార్తె కె.కవిత ఈసారి పోటీ చేయడం లేదు. తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలిగా ఉన్న ఆమెను ఇటీవల ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపించింది. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది.

2001లో తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కేసీఆర్ 2004లో కరీంనగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికై కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అయ్యారు. 2006, 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన అదే స్థానాన్ని నిలబెట్టుకున్నారు.2009లో కేసీఆర్ మహబూబ్‌నగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ కాలంలోనే తెలంగాణ రాష్ట్ర లక్ష్యాన్ని సాధించడంలో విజయం సాధించారు.

2014లో తెలంగాణలో టీఆర్ఎస్ తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. మరోసారి అసెంబ్లీకి ఎన్నికైన ఆయన కుమారుడు, మేనల్లుడు ఆయన కేబినెట్‌లో మంత్రులు అయ్యారు. ఏకకాలంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కవిత నిజామాబాద్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 2018లో టీఆర్‌ఎస్‌ అధికారాన్ని నిలబెట్టుకోగా, 2019 ఎన్నికల్లో నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ చేతిలో కవిత ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె శాసనమండలికి ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ కాంగ్రెస్‌ చేతిలో అధికారాన్ని కోల్పోయింది.

మే 13న ఎన్నికలు జరగనున్న మొత్తం 17 స్థానాలకు అభ్యర్థులను బీఆర్‌ఎస్ ప్రకటించింది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతూకం పాటించామని ఆ పార్టీ పేర్కొంది. అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ సామాజిక సమీకరణలను పరిశీలించి, తద్వారా అన్ని వర్గాల విశ్వాసాన్ని పొందేలా అభ్యర్థుల ఎంపిక చేసినట్లు గులాబీ పార్టీ నేతలు తెలిపారు. అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే వెనుకబడిన కులాల నుంచి ఆరుగురు, షెడ్యూల్డ్ కులాల నుంచి ముగ్గురికి, షెడ్యూల్డ్ తెగల నుంచి ఇద్దరికి, ఇతర కులాల నుంచి ఆరుగురికి బీఆర్ఎస్ టికెట్లు దక్కాయి.
2019లో తొమ్మిది స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్ ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు – నామా నాగేశ్వరరావు (ఖమ్మం), మాలోత్ కవిత (మహబూబాబాద్), మన్నె శ్రీనివాస్ రెడ్డి (మహబూబ్‌నగర్)లకు మరోసారి అవకాశం కల్పించింది. ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు ఇతర పార్టీలకు ఫిరాయించగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక సిట్టింగ్ ఎంపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక ప్రజల మద్దతున్న నాయకులను ఎంపిక చేయడం ద్వారా, ప్రత్యర్థులతో పోలిస్తే వీరికి మంచి అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ భావిస్తోంది.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని, ఈ భావన మరింత బలపడుతోందని గులాబీ పార్టీ విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో తన విజయాన్ని నమోదు చేసేందుకు పార్టీ సన్నాహాలు చేస్తోంది. కొంతమంది అభ్యర్థులు ఇప్పటికే నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తమకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని గులాబీ పార్టీ పేర్కొంది. అన్ని నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజల ఆదరణ పొందేందుకు పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు సన్నద్ధమవుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ త్వరలో నియోజకవర్గాల్లో పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.