తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణకు సంబంధించి 33 ఏళ్ల సర్వీస్ లేదా 61 సంవత్సరాల వయో పరిమితి ఏది ముందైతే అది తక్షణమే అమలు చేయాలని నిర్ణయించింది.
33 ఏళ్ల సర్వీసు, 61 సంవత్సరాల వయో పరిమితి పూర్తైన అధికారుల తక్షణ పదవీ విరమణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. తద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో మేలు చేకూర్చే అవకాశాలు కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మార్చి 31 నుంచి రాష్ట్రంలో భారీగా పదవీ విరమణలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ కొత్త నిర్ణయంపై సాధారణ పరిపాలన శాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఫైల్ ఆమోదం కోసం అధికారులు సీఎంవోకు పంపారు. అయితే దీని ఆమోదానికి ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఎన్నికల కోడ్ తొలగిన వెంటనే ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. ప్రస్తుతం ఆ వయో పరిమితి గడువు ముగియడంతో పదవీ విరమణలు కొనసాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల కానున్నాయి. అప్పటివరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది.