గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్‌కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్‌కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. బుధవారం రాత్రి ఆ మహిళ అపహరణకు గురయ్యారని డయల్-100 ద్వారా పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆ విషయాన్ని ఆ రాత్రికి తెలియజేయకుండా గోప్యత పాటించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలాంటి విషయాలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టిలో పెడతారు. అలాంటిది కీలకమైన ఎన్నికల సమయంలో, ఆపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న ఆమె కిడ్నాప్‌కు గురైతే చెప్పకపోవడం ప్రశ్నార్థకమవుతోంది. ఆ మహిళను గురువారం వారి తండ్రికి అప్పగించడానికి కొద్ది నిమిషాల ముందే ఆయన చెవిలో పడేసినట్లు సమాచారం. అప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? అప్పటికే ఆమె కిడ్నాప్ వ్యవహారం మీడియాలో రావడం చూసి సదరు ఉన్నతాధికారి కంగుతిన్నారు. ఏం జరిగిందని తెలుసుకోవడానికి ప్రయత్నించే లోపే ఓ అధికారి నుంచి ఫోన్ వెళ్లింది. ఇప్పుడు చెబుతారా అంటూ ఉన్నతాధికారి ఆగ్రహించినట్లు సమాచారం. ఓ అధికారి ఆదేశాల మేరకు ఉన్నతాధికారికి తెలియనీయకుండా గోప్యత పాటించారని తెలుస్తోంది.
విడిచిపెట్టి మళ్లీ తీసుకురావడం ఏమిటి?
ఆ మహిళను బుధవారం రాత్రి స్టేషన్ నుంచి పంపించేశామని తెదేపా లీగల్‌సెల్ న్యాయవాదులకు సమాధానమిచ్చిన పోలీసులు తిరిగి గురువారం ఎందుకు స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆమె ఎక్కడ ఉందో చెప్పాలని పోలీసుల్ని గట్టిగా నిలదీశారు. తాము హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేస్తామని న్యాయవాదులు స్పష్టం చేయడంతో ఉదయం పంపించేశామని చెప్పారు. అయితే ఆ మహిళ గురువారం ఉదయం 11 గంటల సమయంలో స్టేషన్‌కు సమీపంగానే మరోసారి అపహరణకు గురయ్యారు. అయితే ఇంతకీ ఆమె ఎక్కడ ఉన్నారనేది తెలియడం లేదు. ఆమె మాట్లాడిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. తానేమీ నామినేషన్ వేయడం లేదని, దయ చేసి తనను రాజకీయాల్లోకి లాగొద్దని కోరారు.
మీ స్టేషన్‌లో ఉందా?
అపహరణకు గురైన రజని మీ స్టేషన్‌లో ఏమైనా ఉందా? వికాసనగర్‌లో ఉందట కదా? అని ఆరా తీయడం ప్రాధాన్యం సంతరించుకుంది. నగరంపాలెంలో కేసు నమోదైతే ఆ స్టేషన్‌లో కాకుండా ఇతర స్టేషన్లలో ఏమైనా ఉన్నారా అని ఆరా తీయడం వెనుక ఓ కారణం లేకపోలేదు. పోలీసుల చెర నుంచి తప్పించుకోకుండా చూడడానికి నగరంపాలెం స్టేషన్ సిబ్బందే కాదు ఇతర పోలీసుస్టేషన్ల సిబ్బందికి ఆమెను కాపాడే బాధ్యతలు అప్పగించిన విషయం తెలుసుకునే సదరు అధికారులు ఆమె గురించి ఇతర పోలీసు స్టేషన్లలో కూడా ఆరా తీశారని చెబుతున్నారు.