Kiren Rijiju: డ్రాగన్ కంట్రీ చైనా, భారతదేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌ని తమదిగా చెప్పుకుంటోంది. తాజాగా అరుణాచల్‌లో పలు ప్రాంతాలకు కొత్త పేర్లను పెట్టింది. ఈ పరిణామంపై భారత్ తీవ్ర అభ్యంతరం చెప్పింది. పేర్లు మార్చినంత మాత్రాన ఏం జరగదని, అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమని భారత విదేశీ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ వివాదంపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం బలమైన సరిహద్దు విధానానని కలిగి ఉందని, ఇదే చైనాను చికాకు పెట్టిందని ఆయన అన్నారు.
అరుణాచల్ ప్రదేశ్‌లోని 30 ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడంపై కేంద్రమంత్రి స్పందిస్తూ.. ప్రస్తతం భారతదేశం 1962 నాటిది కాదని, ప్రతీ అంగుళాన్ని కాపాడుకుంటామని అన్నారు. 1962 నాటి ఇండియా-చైనా యుద్ధం గురించి ప్రస్తావించారు. బెదిరిస్తే భయపడటానికి భారత్ చిన్న, బలహీన దేశం కాదని ఆయన చెప్పారు. సరిహద్దు విషయాల్లో నిక్కచ్చిగా వ్యవహరించే ప్రభుత్వం భారతదేశంలో ఉందని, ఈ విషయాన్ని చైనీయులు అకస్మాత్తుగా గ్రహించి ఉంటారని ఆయన అన్నారు. సరిహద్దుల్లో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధి, ఇతర పనుల గురించి చైనా అధికారులు ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు.
2014 వరకు లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు సరిహద్దు సమస్యల్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఈ విషయాన్ని 2013లో అప్పటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ అంగీకరించారని కిరణ్ రిజిజు అన్నారు. దీనికి వారు చెప్పిన కారణం అంగీకరించేదిలా లేదని, సరిహద్దుల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాలు చైనా మన దేశంపై దండెత్తే పరిస్థితి కాణమవుతుందని కాంగ్రెస్ పేర్కొందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతాలను పూర్తిగా రక్షణ లేకుండా చైనీయులు ఆక్రమించేలా విడిచిపెట్టబడ్డాయని అన్నారు.