వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే తేలికపాటి భోజనానికి సరైన ఆప్షన్ “కొసాంబరి”. ఇది సౌత్ ఇండియాలో ప్రసిద్ధి చెందిన సలాడ్ లాంటి వంటకం. పెసరపప్పు, క్యారెట్, మామిడికాయ వంటి పోషకాలు కలిగిన పదార్థాలతో తయారవుతుంది. ఈ రెసిపీ రుచికి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీని తయారీ కూడా చాలా సులువు. తక్కువ సమయంలోనే పూర్తవుతుంది. వేడివేడి అన్నంతో లేదా విడిగా స్నాక్‌గా తీసుకున్నా, ఈ కొసాంబరి ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. మరి, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం!
కొసాంబరి తయారీకి కావాల్సిన పదార్థాలు :
1 కప్పు – పెసరపప్పు
1 కప్పు – క్యారెట్ తురుము
1 – పచ్చిమిర్చి
1/2 కప్పు – మామిడికాయ ముక్కలు
1 గుప్పెడు – కొత్తిమీర
రుచికి సరిపడా – ఉప్పు
2 స్పూన్లు – నూనె
1 స్పూన్ – ఆవాలు
1/2 స్పూన్ – కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు
1/4 స్పూన్ – ఇంగువ
కొద్దిగా – కరివేపాకు
కొద్దిగా – అల్లం ముక్క
2 – పచ్చిమిర్చి ముక్కలు
కొద్దిగా – కరివేపాకు
కమ్మటి పెరుగు
నల్ల ఉప్పు
జీలకర్ర పొడి
నీళ్లు
కొత్తిమీర
కొసాంబరి తయారీ విధానం :
ముందుగా ఒక బౌల్లో పెసరపప్పు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి కనీసం అరగంట పాటు నానబెట్టాలి. నానిన పెసరపప్పు కొద్దిగా మెత్తబడుతుంది.
పెసరపప్పు బాగా నానిన తర్వాత ఒక స్ట్రైనర్ లేదా చిల్లుల గిన్నెలోకి వడకట్టి, అందులోని నీళ్లన్నీ పూర్తిగా పోయేలా చూడాలి.
అనంతరం వడకట్టిన పెసరపప్పును ఒక పెద్ద గిన్నెలో వేయాలి. తర్వాత అందులో క్యారెట్ తురుము, సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి (మీ రుచికి తగ్గట్టు ఎక్కువ లేదా తక్కువ వేసుకోవచ్చు), చిన్నగా తరిగిన పచ్చి మామిడికాయ ముక్కలు (పుల్లటి రుచి కోసం), ఒక గుప్పెడు సన్నగా తరిగిన తాజా కొత్తిమీర వేయాలి.
చివరగా మీ రుచికి సరిపడా ఉప్పు వేసి అన్ని పదార్థాలు బాగా కలిసేలా స్పూన్‌తో కలిపి పక్కనుంచాలి.
ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు, ఇంగువ వేయాలి. చివరగా కొన్ని కరివేపాకు ఆకులు వేసి అవి చిటపటలాడే వరకు వేయించుకొని స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
అనంతరం ఈ తాలింపును ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెసరపప్పు మిశ్రమంలో వేసి బాగా కలపాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే “కొసాంబరి” సిద్ధమైపోతుంది. చక్కటి పోషకాలు కలిగిన ఈ రెసిపీ సమ్మర్లో ఎంతో బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.