ఏపీకి తుఫాను ముప్పు!: నేడు అండమాన్ సమీపంలో అల్పపీడనం

బంగాళాఖాతంలో శనివారం (నేడు) అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ, సోమవారం నాటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది.


ఆ తర్వాత కూడా అదే దిశలో ప్రయాణిస్తూ, బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో మరింత బలం పుంజుకుని తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలియజేశారు.

ఈ అల్పపీడనం, తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా శనివారం (నేడు) రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచనల ప్రకారం.. ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు ఈ అల్పపీడనం ఏర్పడుతున్న కారణంగా బంగాళాఖాతం నుంచి రాష్ట్రం వైపునకు తేమ గాలుల ప్రవాహం పెరిగింది. ఈ గాలుల ప్రభావం వలన రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఉన్న చలి తీవ్రత గణనీయంగా తగ్గింది. గురువారం రాత్రి నుంచి ఏజెన్సీ ప్రాంతాలలో రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగినట్లుగా నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరిగాయి. తుపాను తీవ్రత పూర్తిగా తగ్గే వరకు రాష్ట్రంలో చలి ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నవంబర్ 23 నుంచి తెలంగాణలో వర్షాలు

తెలంగాణలో శనివారం చలి వాతావరణమే కొనసాగుతుందని.. ఎలాంటి వర్షాలుండవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం నుంచి చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షాలు మొదలవుతాయని తెలిపింది. దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఆదివారం వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. సోమవారం కూడా తెలంగాణలో వర్షాలు కొనసాగే అవకాశముందని తెలిపింది. వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ వర్షాల వల్ల గాలిలో తేమ పెరిగి చలి తగ్గుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అంటే తెలంగాణలో వచ్చే ఆదివారం నుంచిఉష్ఱోగ్రత సాధారణ స్థాయికి చేరుకుని చలి తగ్గుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.