జగన్ లాంటి విపరీత, విధ్వంసకర ఆలోచనలు ఉండే వ్యక్తులు ముఖ్యమంత్రి స్థానానికి అర్హులు కారని.. మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి ఎదురైన అనుభవాలు మరోసారి రుజువు చేశాయి. వైకాపా అధికారంలోకి వచ్చిన కొత్తలో కొంతకాలం సీఎస్‌గా పనిచేసిన ఆయన జగన్‌తో తనకు ఎదురైన, షాక్‌కు గురిచేసిన కొన్ని అనుభవాలను ‘ఈనాడు’తో పంచుకున్నారు. విశాఖలోని ఉక్కు కర్మాగారాన్ని నగరం నుంచి 20 కి.మీ.ల దూరానికి తరలించి, ఆ భూముల్లో రాజధాని కడదామని జగన్ చెప్పినప్పుడు దిగ్భ్రాంతి చెందానని ఆయన తెలిపారు. ప్రజావేదికను కూల్చేయాలన్న నిర్ణయమూ తనను షాక్‌కి గురి చేసిందన్నారు. ‘‘రాష్ట్ర అభివృద్ధి, నిధులు, బడ్జెట్ లాంటి అంశాలపై చర్చించేందుకు ఆయనకు ఎంతమాత్రం ఆసక్తి, ఓపిక ఉండేవి కావు. దేనిపైనా లోతుగా, విస్తృతంగా చర్చించడం ఆయనకు ఇష్టం ఉండదు. ఆయనతో ఏం చెప్పాలనుకున్నా రెండు నిమిషాల్లో ముగించేయాలి. మనం ఏదైనా విషయాన్ని ఆయనకు అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నిస్తే మనకు చాదస్తమని, ఆ పని చేయడానికి మనం వ్యతిరేకమని భావించేవారు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి ఎంతో బాధ్యతగా ఉండాలి. మన ప్రాణాలన్నీ ఆయన చేతిలో పెట్టినప్పుడు… బాధ్యతగా వ్యవహరించకపోతే మన ప్రాణాలకు, భవిష్యత్తుకు ముప్పు. ఈ విషయాలు నేను ఎన్నికల ముందు చెబితే దురుద్దేశాలు అంటగడతారు. అందుకే ఇప్పుడు చెబుతున్నాను. మనం ఎలాంటి వ్యక్తుల్ని ఎన్నుకుంటున్నామన్న విషయంలో ప్రజలు ఇకపైనా అప్రమత్తంగా ఉండాలన్నదే నా అభిమతం’’ అని ఆయన తెలిపారు.
అర్థం కావడానికి సమయం పట్టింది
విశాఖలో స్టీల్‌ప్లాంటు వల్ల కాలుష్యం పెరుగుతోందని, దాన్ని అక్కడినుంచి తీసేసి ఆ భూముల్లో రాజధాని కడతానని జగన్ ఒక సందర్భంలో చెప్పడంతో షాక్ తిన్నానని ఎల్వీ చెప్పారు. ‘‘ఆయన ఏమంటున్నారో అర్థం కావడానికి నాకు కొంత సమయం పట్టింది. స్టీల్‌ప్లాంటు వల్ల అంత కాలుష్యమేమీ ఉండదని, కావాలంటే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలితో అధ్యయనం చేయిద్దామని చెప్పాను. ‘దానికాయన… నీకేమీ తెలియదన్నా ఊరుకో…! ప్రతిదానికీ కేంద్రం అంటావ్’ అని విసుక్కున్నారు. ‘స్టీల్‌ప్లాంటుకు ఎంత భూమి ఉందో తెలుసా?’ అని అడిగారు. 32-33 వేల ఎకరాలుంటుందని చెప్పాను. స్టీల్‌ప్లాంటును నగరం నుంచి 20 కి.మీ.ల దూరం జరిపేస్తే… ఆ భూముల్లో రాజధాని కట్టుకోవచ్చని ఆయన అన్నారు. దానిలోని మంచి.. చెడు చర్చించేందుకు ఆయన ఇష్టపడలేదు’’ అని ఎల్వీ తెలిపారు.
ప్రజావేదికను చూశాకైనా..
‘‘వైకాపా అధికారంలోకి వచ్చాక కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టాలనుకున్నారు. స్టార్ హోటళ్లలో పెట్టడం సీఎంకు ఇష్టం లేదని సీఎంఓ చెప్పింది. ప్రజావేదిక అనుకూలంగా ఉంటుందని, కాదంటే ఏదైనా ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్‌లో పెట్టాల్సి వస్తుందని చెప్పాను. కాన్ఫరెన్స్ తేదీకి రెండు మూడు రోజుల ముందు వరకు సమావేశం ఎక్కడ పెట్టాలన్న విషయంలో సీఎంఓ నుంచి స్పష్టత రాలేదు. వేదిక ఖరారు కానిదే ఏర్పాట్లు చేయలేం. మేం ఆ టెన్షన్‌లో ఉన్నప్పుడు సీఎంఓ నుంచి ధనుంజయరెడ్డి ఫోన్ చేసి… ప్రజావేదికలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహణకు సీఎం అంగీకరించినట్టు చెప్పారు. ప్రజావేదికను కూల్చేయబోతున్నారన్న విషయాన్నీ అప్పుడే చెప్పారు. దాన్ని గోప్యంగా ఉంచాలని, ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటిస్తారని అన్నారు. అది విని షాక్ తిన్నాను. జగన్ ప్రజావేదిక చూడలేదు కాబట్టి అలాంటి ఆలోచన చేస్తున్నారని, దాన్ని చూశాకైనా మనసు మార్చుకుంటారని అనుకున్నాను’’ అని తెలిపారు. ప్రజావేదికను కూల్చేస్తున్నప్పుడు దానిలోని ఏసీలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వాడుకోవచ్చునని జీఏడీ అధికారులకు సూచించానని, కానీ వాటన్నిటినీ అక్కడే పడేయడం గత ప్రభుత్వ కక్షసాధింపు ధోరణికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
అలా అనడంతో ఆశ్చర్యపోయా!
‘రాజధానిని అమరావతిలో కట్టేద్దామంటావా.. నీ అభిప్రాయమేంటన్నా? అని జగన్ నన్ను అడిగారు. రాజధానిగా అమరావతినే నోటిఫై చేశారు కదా అని బదులిచ్చాను. నీకు తెలియదన్నా… అమరావతిలో చంద్రబాబుకు చాలా భూములున్నాయి… అని జగన్ అనడం ఆశ్చర్యానికి గురిచేసింది. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఎలాంటి ఆధారాల్లేకుండా అలాంటి ఏకపక్ష ఆరోపణలు చేసినప్పుడు మనం ఏం సమాధానం చెబుతాం..! ఎవరిపైనైనా ఆరోపణలు వచ్చినా అవి నిరూపితమయ్యే వరకు వాటి గురించి మాట్లాడకూడదన్న సూత్రాన్ని… సీఎం వంటి బాధ్యతాయుత స్థానంలో ఉన్నవారు పాటించాలి. లేకపోతే విచారణ చేస్తున్న అధికారుల్ని ప్రభావితం చేసినట్టవుతుంది’ అని ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. రాజధానిలో చంద్రబాబుకు భూములున్నాయా? అని తర్వాత సీఆర్‌డీఏ అధికారులను తాను కనుక్కుంటే.. అలాంటిదేమీ లేదని వారు బదులిచ్చినట్టు తెలిపారు.