మద్రాస్‌ హైకోర్టు తీర్పు హిందూత్వ మనువాదులకు చెంపపెట్టు!

ఉన్నది ఉన్నట్లు చెప్పినా తమ మనోభావాలను దెబ్బ తీశారంటూ దెబ్బలాటలకు దిగుతున్న పరిస్థితి. తరతరాలుగా జరుగుతున్నదే. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని నాటి క్రైస్తవ మతగ్రంథాలు, జ్యోతిష గ్రంథాలు చెప్పినది వాస్తవం కాదని సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నదని నిరూపించిన ఖగోళ శాస్త్రజ్ఞుడు నికోలస్‌ కోపర్నికస్‌పై ఐదు వందల సంవత్సరాల క్రితమే నాటి క్రైస్తవ మతవాదులు దాడి చేశారు, మూర్ఖుడని నిందించారు.


చరిత్రలో ఏ మతవాదీ నిజాన్ని అంగీకరించిన దాఖలా లేదు. మన దేశంలో హిందూత్వ, ఇస్లామిక్‌, క్రైస్తవ మతవాదులు దానికి అతీతులు కాదు. అలాంటి వారికి 2025 జనవరి మొదటి వారంలో మద్రాస్‌ హైకోర్టు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చింది.
తమిళనాడులో విడుతలై చిరుతాయిగల్‌ కచ్చి (విసికె) అనే పార్టీ ఎంపీ తిరుమావళవన్‌. అతని మీద 2020లో ఒక ప్రైవేటు కేసు నమోదైంది. అదేమిటంటే పెరియార్‌ అనే యూట్యూబ్‌ ఛానల్‌లో ఫిర్యాదుదారు ఒక కార్యక్రమాన్ని చూశారు. తిరుమావళవన్‌ మరొక వ్యక్తితో కలసి హిందూ మహిళల గురించి బహిరంగంగా చెప్పిన మాటలు వారి స్థాయిని దిగజార్చేవిగా ఉన్నాయని, వారి గురించి ఒక తప్పుడు కథనాన్ని చెప్పారని, వాటిని విని ఒక హిందువుగా అవమానకరంగా భావించానని, తన మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నందున తగిన చర్యలు తీసుకొని శిక్షించాలన్నది కేసు సారం. ఆ కేసులో పసలేదని దాన్ని కొట్టివేయాలంటూ తిరుమావళవన్‌ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. దాని మీద విచారణ జరిపిన న్యాయమూర్తి పి.వేలుమురుగన్‌ కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. కరోనా సమయంలో ‘పెరియార్‌-భారత రాజకీయాలు’ అనే అంశంపై యూరోపియన్‌ పెరియార్‌ అంబేద్కర్‌ కామ్రేడ్స్‌ ఫెడరేషన్‌ నిర్వహించిన అంతర్జాతీయ అంతర్జాల సమావేశంలో తిరుమావళవన్‌ ప్రసంగించారు. దానిలో మనుస్మృతిలో ఉన్న కొన్ని అంశాలను ప్రస్తావించారు. అవి తమ మనోభావాలను దెబ్బ తీశాయన్నది కేసు. అయితే తిరుమావళవన్‌ మనుస్మృతిలో ఉన్న అంశాలను ప్రస్తావించి వాటికి అర్ధం చెప్పారు. తానుగా కొత్తగా చెప్పిందేమీ లేనందున ఎలాంటి చర్య తీసుకోనవసరం లేదంటూ న్యాయమూర్తి కేసును కొట్టివేశారు. తిరోగామి భావజాలం గురించి గతంలోనే అనేక మంది చీల్చి చెండాడారు. వాటిని పునశ్చరణ చేయవచ్చు, మరింతగా వివరించవచ్చు. అంతే కాదు ఈ తీర్పుతో ఒకటి స్పష్టమైంది. ఎవరినీ కొట్టావద్దు తిట్టావద్దు, పురాతన సంస్కృత గ్రంథాల్లో ఉన్న వాటి అసలు అర్ధాలను చెబుతూ వాటిని జనంలోకి మరింతగా తీసుకువెళితే చాలు. ముంజేతిని చూసుకొనేందుకు అద్దాలు అవసరం లేదు.
ఇదే అంశంపై మద్రాస్‌ హైకోర్టులో దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని 2020 నవంబరులో జస్టిస్‌ ఎం సత్యనారాయణన్‌, జస్టిస్‌ ఆర్‌ హేమలత డివిజన్‌ బెంచి కొట్టివేసింది. ఎస్‌ కాశీరామలింగం దాఖలు చేసిన ఈ వ్యాజ్యంలో బిజెపి నేత, న్యాయవాది ఆర్‌సి పాల్‌ కనకరాజ్‌ వాదించారు. ఉనికిలో లేని మనుస్మృతిని నిషేధించాలని పార్లమెంటు సభ్యుడు కోరుతూ చేసిన ప్రసంగం అశాంతికి, వివిధ తరగతులను రెచ్చగొట్టటానికి దోహదం చేసినందున సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని కోర్టును కోరారు. ప్రసంగం చేయటమే గాక దాన్ని నిషేధించాలని కూడా డిమాండ్‌ చేశారన్నారు. మనుస్మృతి రాజ్యాంగ బద్దమైనదేమీ కాదని, అందువలన దాన్ని ఫలాన విధంగానే చదవాలనే నిబంధనేమీ లేదని, రెండు వేల సంవత్సరాల నాటి గ్రంథానికి భాష్యాలు చెప్పవచ్చని అందువలన ఎంపీపై చర్య తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు తీర్పు చెప్పింది. దానిలో చెప్పిన నైతిక నియమావళి రాజ్యాంగబద్దం కాదని, వాటిని అమలు జరపలేమని న్యాయమూర్తులు పేర్కొన్నారు. వాద ప్రతివాదనల సందర్భంగా తమ పిటీషన్‌ను ఉపసంహ రించుకొని రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన అంశాలతో మరొక పిటీషన్‌ దాఖలు చేసేందుకు అనుమతించాలని న్యాయవాది పాల్‌ కనకరాజ్‌ కోర్టును కోరారు. చివరికి పిల్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ అంశం మీదే జిల్లా కోర్టులో ఒక ప్రైవేట్‌ కేసును దాఖలు చేశారు.దాన్ని ఈ నెలలో హైకోర్టు కొట్టివేసింది.
మద్రాస్‌ హైకోర్టు తీర్పు మరో ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది. కర్ణాటకలో మైసూరు విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్‌, ప్రముఖ రచయిత, హేతువాది కెఎస్‌. భగవాన్‌. రామాయణం ఉత్తరకాండలో ఉన్న వాటిని గురించి చెప్పినందుకు హిందూత్వవాదులు అంతుచూస్తామని బెదిరించారు. గత కొద్ది సంవత్సరాలుగా ఆయన ఈ అంశాలను చెబుతున్నారు. ఉత్తరకాండలో ఉన్నదాని ప్రకారం రాముడు పదకొండువేల సంవత్సరాలు పాలించలేదని, పదకొండు ఏళ్లు మాత్రమే రాజుగా ఉన్నట్లు, అడవుల్లో తాను మద్యం తాగుతూ సీతాదేవిని కూడా తాగమని కోరినట్లు, కొందరు రామరాజ్యం తెస్తామని చెబుతున్నారని, రాముడు ఆదర్శప్రాయుడేమీ కాదని భగవాన్‌ చెప్పిన అంశాలు తమ మనోభావాలను గాయపరచినట్లు కొందరు ప్రైవేటు కేసును దాఖలు చేశారు. సీతాదేవిని అడవుల పాల్జేసి పట్టించుకోని, శూద్రుడైన శంబుకుణ్ని వధించిన రాముడిని ఎలా సమర్ధిస్తారని భగవాన్‌ ప్రశ్నించారు. “ప్రొఫెసర్‌ కల్‌బుర్గి, గోవింద్‌ పన్సారే, నరేంద్ర దబోల్కర్‌లను హత్య చేసినవారు ఇప్పుడు నన్ను కూడా చంపుతామని బెదిరిస్తున్నారు. వారికి నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. మీరు మా మీద దాడి చేయవచ్చు, ముక్కలుగా నరకవచ్చు కానీ మా రచనలు సజీవంగానే ఉంటాయి. వారు నన్ను చంపవచ్చు తప్ప. నా వైఖరిని మార్చలేరు” అని భగవాన్‌ స్పష్టం చేశారు. ఈ వివాదం తరువాత కొంత మంది అసలు ఉత్తరకాండను వాల్మీకి రాయలేదని, తరువాత కొందరు దాన్ని చేర్చారని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రామాయణాలు అనేకం ఉన్నాయి. దేన్ని సాధికారికంగా తీసుకోవాలో చెప్పినవారెవరూ లేదు. ఎవరికీ అలాంటి సాధికారత లేదు. ఎవరైనా పుచ్చుకుంటే దానితో అంగీకరించాలని కూడా లేదు.
మనుస్మృతిలో రాసినవి, వాటి ఆచరణ చూసి తన మనోభావాలు తీవ్రంగా గాయపడిన కారణంగానే బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ వంద సంవత్సరాల క్రితమే దాన్ని తగులబెట్టి నిరసన వెల్లడించారు. సదరు మనువాదాన్ని మరింతగా ముందుకు తీసుకుపోవాలని, అది లేకుండా రచించిన రాజ్యాంగాన్ని విమర్శిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక సంపాదకీయాలు రాసింది. రాజ్యాంగ నిర్మాతలు పక్కన పెట్టిన మనుస్మృతిని తమ న్యాయశాస్త్ర విద్యార్ధులకు పాఠ్యాంశంగా పెట్టాలని ఢిల్లీ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. కోర్టులలో అమలు చేసే శిక్షాస్మృతులను పాఠాలుగా చెప్పాలి, శిక్షణ ఇవ్వాలి తప్ప ఇలాంటి చర్యలతో అధికారికంగా మనువాదులను తయారు చేసే వ్యవహరం తప్ప మరొకటి కాదు. ఇలాంటి బలవంతాలు చేసే శక్తులు ఒక వైపు రెచ్చిపోతుంటే మరోవైపు దాన్ని వ్యతిరేకించేవారు కూడా ఎప్పటికప్పుడు తయారవుతారు. నూతన ఆర్థిక విధానాల పేరుతో కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన సంస్కరణలు దేశంలో ఆర్థిక అసమానతలను మరింతగా పెంచి, కార్పొరేట్‌ జలగలకు జనాలను అప్పచెప్పాయి. వాటిని మరింత వేగంగా అమలు జరుపుతున్న బిజెపి నూతన విద్యావిధానం పేరుతో తన కాషాయ ఎజెండాను దేశం మీద రుద్దేందుకు పూనుకుంది. దానిలో భాగమే సిలబస్‌లో మనువాదాన్ని చేర్చటం. మరింతగా మనువాదులను న్యాయ వ్యవస్థలో చేర్చేందుకు వేసిన పథకమిది. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలకు విద్య, సమాన హక్కులు, సాధికారతను పూర్తిగా వ్యతిరేకించే తిరోగమన భావాలను బలవంతంగా అధ్యయనం చేయించేందుకు చూస్తున్నారు. అంతేకాదు, శూద్రులు, దళితులుగా ఉన్న 85 శాతం మంది గురించి కూడా దాన్నిండా వ్యతిరేకతలే, మొత్తంగా మన రాజ్యాంగానికి, దానికి స్ఫూర్తికి వ్యతిరేకమైనది.
ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో భగత్‌ సింగ్‌ స్టూడెంట్స్‌ మోర్చా (బిఎస్‌ఎం)కు చెందిన వారు డిసెంబరు 25న మనుస్మృతి గ్రంథంపై ఒక చర్చ నిర్వహించారు. తరువాత తగుల బెట్టేందుకు నిర్ణయించారు. ఆ సందర్భంగా ముగ్గురు విద్యార్ధినులతో సహా 13 మందిని పోలీసులు అరెస్టు చేసి కేసు పెట్టారు. పదిహేడు రోజుల తరువాత వారు బెయిలు మీద జనవరి 11న విడుదలయ్యారు. ఈ విశ్వవిద్యాలయంలో మనుస్మృతిపై పరిశోధన చేసే వారికి ఫెలోషిప్‌ ఇస్తున్నారు. దాని గురించి చర్చించేవారిని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా మన నేతన్నలను దెబ్బతీసిన విదేశీ వస్త్రదహనం ఒక పోరాట రూపంగా ఉన్న సంగతి తెలిసిందే. అదే విధంగా దిష్టిబొమ్మల దహనం కూడా. సమాజంలో స్త్రీలు, మెజారిటీ కులాల వారిపట్ల వివక్ష, దురాచారాలను ప్రోత్సహించే మనుస్మృతికి వ్యతిరేకంగా ఒక నిరనస రూపంగా దాని దహనాన్ని అంబేద్కర్‌ ఎంచుకున్నారు. తొలిసారిగా 1927లో స్వయంగా ఆపని చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా డిసెంబరు 25ను మనుస్మృతి దహన దినంగా పాటిస్తున్నారు. ఎక్కడో అక్కడ అది కొనసాగుతూనే ఉంది. బెనారస్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులు హింసాకాండకు, దాడులకు పాల్పడ్డారంటూ తప్పుడు కేసులు పెట్టారు. కస్టడీలో పోలీసులు వారిని కొట్టారు, దుస్తులు చించివేశారు, బెదిరించారు. పదేళ్ల వరకు శిక్షలు పడే సెక్షన్లతో నేరాలను మోపారు. ఉగ్రవాద వ్యతిరేక దళ పోలీసులు వారిని విచారించటాన్ని బట్టి ఎలాంటి నేరాలు మోపారో, ఉత్తర ప్రదేశ్‌లో ఎలాంటి రాజ్యం నడుస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు.