హిందువులు జరుపుకునే ప్రతి పండుగకు ఓ విశిష్టత ఉంటుంది. ఇక మాఘ మాసంలోని శుక్ల పక్ష అష్టమి రోజున హిందువులు భీష్మష్టమిగా జరుపుకుంటారు.
ఈ రోజున మహా భారతంలోని పవర్ ఫుల్ పాత్రల్లో ఒక్కడైన భీష్ముడు మరణించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఉదయం తెల్లవారుజాము 5:32 నిమిషాల నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము 3:13 నిమిషాల వరకు భీష్మ అష్టమి గడియలు వచ్చాయి.
భీష్మష్టమి విశిష్టత
పురాణాల ప్రకారం.. భీష్ముడు.. గంగాదేవి, శంతనుడి కుమారుడు. తన తండ్రి కోసం ఆజన్మాంతం బ్రహ్మచారి వత్రాన్ని స్వీకరించాడు. భీష్ముడు తన తండ్రి శంతనుడి నుంచి తాను కోరుకున్నప్పుడు చనిపోయే వరాన్ని పొందాడు. ఇక కురు క్షేత్ర మహా సంగ్రామంలో భీష్ముడు కౌరవుల తరపున యుద్ధంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో మహా భారత యుద్దంలో శిఖండిని తన ముందుకు యుద్దం చేయడానికి రావడంతో భీష్ముడు తన ఆయుధాలను వదిలేసి, అంపశయ్యపైకి చేరుతాడు.
అయితే, దక్షిణాయనంలో ప్రాణాలు కోల్పొవడానికి ఇష్టం లేని భీష్ముడు.. ఉత్తరాయణం వచ్చే వరకూ అంపశయ్యపై ఉంటాడు. ఆ తర్వాత మాఘామాసం అష్టమి తిథి రోజు నుంచి వరుసగా ఐదు రోజుల పాటు రోజుకొక ప్రాణాన్ని భీష్ముడు విడిచిపెట్టాడు. ఈ ఐదు రోజు కాలాన్ని భీష్మ పంచకాలుగా హిందువులు భావిస్తారు. భీష్ముడు ప్రాణాలు విడిచిన ఈ పవిత్రమైన రోజున భీష్ముడికి తర్పణం సమర్పిస్తే విశేషమైన పుణ్యఫలం కలుగుతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వసిస్తారు.
భీష్మష్టమి రోజు దానం ఇవ్వాల్సినవి..
భీష్మష్టమి రోజు పండితులకు బియ్యం, పప్పులు, కూరగాయలు దానంగా ఇవ్వాలి. వస్తాలు, పేదలకు అన్నదానం చేయాలి. విష్ణు ఆలయాలను సందర్శించాలి. అంతే కాకుండా ఆరోజున వీలైతే ఉపవాసం ఉండి, ఆవులకు పశుగ్రాసం పెట్టాలి. ఇలా చేస్తే జీవితంలోని సమస్యలన్ని దూరమౌతాయని పండితులు చెబుతుంటారు.