రాష్ట్రంలో జాతీయ రహదారులకు మహర్దశ పట్టనుంది. పలు హైవేలను పది మీటర్ల వెడల్పుతో రెండు వరుసలుగా, మరికొన్నింటిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్) భారీగా నిధులు మంజూరుచేసింది. 457 కిలోమీటర్ల హైవేల పనులకు రూ.12,152 కోట్లతో 2025-26 వార్షిక ప్రణాళికను తాజాగా ప్రకటించింది. వీటిలో సుదీర్ఘకాలం నుంచి విస్తరణ కోసం ఎదురుచూస్తున్న హైవేలు, వంతెనలు, రైల్వే క్రాసింగ్స్ వద్ద ఆర్వోబీలు ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటికీ మోక్షం కలిగినట్లు అయింది.
నాలుగు వరుసల యోగం
- కృష్ణా జిల్లా పెడన నుంచి గుడివాడ, హనుమాన్ జంక్షన్, నూజివీడు, విస్సన్నపేట మీదగా ఎన్టీఆర్ జిల్లా లక్ష్మీపురం వరకు ఉన్న జాతీయ రహదారి-216హెచ్‌ని రూ.4,245 కోట్లతో నాలుగు వరుసలుగా విస్తరించేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇది కత్తిపూడి-ఒంగోలు హైవేలో పెడన వద్ద మొదలై, ఇబ్రహీంపట్నం-జగదల్‌పూర్ హైవేలో లక్ష్మీపురం వద్ద కలుస్తుంది. మొత్తంగా 118 కి.మీ. విస్తరించనున్నారు.
- పామర్రు నుంచి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలో దిగమర్రు వరకు ఉన్న హైవే-165లో.. ఆకివీడు నుంచి దిగమర్రు మధ్య 45 కి.మీ. నాలుగు వరుసలుగా విస్తరించేందుకు ఆమోదం తెలిపారు. దీనికి రూ.2,500 కోట్లు కేటాయించారు.
- వైఎస్సార్ కడప జిల్లాలో ముద్దనూరు నుంచి కడప వరకు ఉన్న ఎన్‌హెచ్-716లో 48 కి.మీ. నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. దీనికి రూ.1,182 కోట్లు కేటాయించారు.
- శ్రీసత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ నుంచి కదిరి వరకు 22 కి.మీ. హైవేని నాలుగు వరుసలుగా విస్తరణకు రూ.428 కోట్లు కేటాయించారు.
- మచిలీపట్నం నుంచి పోర్టు వరకు ఉన్న 8 కి.మీ. రహదారిని నాలుగు వరుసలుగా విస్తరణకు రూ.584 కోట్లు కేటాయించగా, ఈ మార్గాన్ని ఆరు వరుసలుగా విస్తరణకు పరిశీలించాలని కేంద్రం సూచించింది.
- కడప-రాయచోటి హైవేలో గువ్వలచెరువు ఘాట్ కష్టాలు తీర్చేందుకు.. అక్కడ 8 కి.మీ. మేర నాలుగు వరుసల రహదారితో కూడిన సొరంగం నిర్మాణానికి రూ.920 కోట్లు కేటాయించారు.
పది మీటర్ల వెడల్పుతో హైవే విస్తరించేలా..
- అమలాపురం నుంచి రావులపాలెం వరకు 7 మీటర్ల వెడల్పుతో ఉన్న 32 కి.మీ. హైవేని పది మీటర్ల వెడల్పుతో విస్తరించేందుకు రూ.735 కోట్లు వెచ్చించనున్నారు.
- జీలుగుమిల్లి-కొవ్వూరు హైవేలో 86 కి.మీ. ఉండగా, ఇందులో ఇప్పటికే 40 కి.మీ. రెండు వరుసలుగా విస్తరణ చేపట్టారు. ఇందులో మిగిలిన 46 కి.మీ. విస్తరణకు రూ.495 కోట్లు కేటాయించారు.
- తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ఏపీలోని నంద్యాల వరకు ఉన్న హైవే-167కె లో నంద్యాల జిల్లా పరిధిలోని నల్లకాలువ-వెలుగోడు మధ్య 17 కి.మీ. పది మీటర్ల వెడల్పుతో రెండు వరుసలుగా విస్తరించనున్నారు. దీనికి రూ.400 కోట్లు వెచ్చిస్తారు.
- ఎమ్మిగనూరు వద్ద రూ.225 కోట్లతో 9 కి.మీ. బైపాస్ నిర్మించనున్నారు.
వంతెనలకు నిధులు
- బాపట్ల జిల్లా గూడవల్లి వద్ద లోలెవెల్ బ్రిడ్జికి రూ.21 కోట్లు, పల్లెకోన వద్ద వంతెనకు రూ.4 కోట్లు కేటాయించారు.
- సత్యసాయి జిల్లా ముదిగుబ్బ వద్ద రైల్వేగేట్ ఉన్నచోట వంతెన నిర్మాణానికి రూ.50 కోట్లు వెచ్చించనున్నారు.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని వార్షిక ప్రణాళికలో చేర్చిన ప్రాజెక్టులకు.. మార్చి 31లోపు సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌లు) సిద్ధం చేసి, మోర్త్ ఉన్నతాధికారుల వద్ద సాంకేతిక అనుమతులు తీసుకోవాలి. తర్వాత ఆర్థికపరమైన క్లియరెన్స్ ఇస్తారు. వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించొచ్చు.