ప్రతి వంటింట్లో సేమియా తప్పకుండా ఉంటుంది! ఇంట్లో టిఫిన్ చేయడానికి ఇడ్లీ, దోసె పిండి లేకపోతే అప్పటికప్పుడు సేమియా ఉప్మా చేసేస్తుంటాం. అలాగే సమయం తక్కువగా ఉన్న సందర్భాల్లో దేవుడికి నైవేద్యంగా పాయసం చేస్తుంటాం. అయితే, కొన్నిసార్లు సరైన కొలతలు పాటించకపోతే సేమియా పాయసం గట్టిగా ఉంటుంది. ఇలా సేమియా పాయసం గట్టిగా ఉంటే అంతగా తినాలనిపించదు. అయితే, ఇక్కడ చెప్పిన కొలతలతో ఓసారి సేమియా ఖీర్ ప్రిపేర్ చేయండి, జారుగా ఎంతో రుచిగా ఉంటుంది. ఈ సేమియా పాయసం పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరి కమ్మని సేమియా ఖీర్ ఎలా చేయాలో చూద్దామా!
సేమియా పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు
- సేమియా – ఒక కప్పు
- 2 కప్పులు – నీళ్లు
- కప్పు – చిక్కటి పాలు
- నెయ్యి – సరిపడా
- అర టీస్పూన్ – యాలకుల పొడి
- చిటికెడు – కుంకుమ పువ్వు
- రుచికి సరిపడా – చక్కెర
- పావు కప్పు – సన్నగా తరిగిన కిస్మిస్, జీడిపప్పు, బాదం, పిస్తా
-
సేమియా ఖీర్ తయారీ విధానం
- ముందుగా స్టవ్‌పై అడుగు మందంగా ఉండే కడాయి పెట్టి టేబుల్‌స్పూన్ నెయ్యి వేసి హీట్ చేయండి. నెయ్యి వేడయ్యాక పావు కప్పు సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించండి.
- డ్రై ఫ్రూట్స్ దోరగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకోవాలి.
- అదే పాన్‌లో ఒక కప్పు సేమియా వేసి లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి.
- సేమియా దోరగా వేయించుకునే లోపు మరొక స్టవ్‌పై కడాయి పెట్టి 2 కప్పులు నీళ్లు, కప్పు చిక్కటి పాలు వేసి మరిగించండి.
- పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఎర్రగా వేయించుకున్న సేమియాలో వేసి కలుపుకోవాలి.
- స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసి సేమియా మెత్తగా ఉడికించుకోవాలి. సేమియా చక్కగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా చక్కెర వేసి మిక్స్ చేసుకోవాలి.
-
- పంచదార పూర్తిగా కరిగి కాస్త చిక్కబడిన తర్వాత అర టీస్పూన్ యాలకుల పొడి, చిటికెడు కుంకుమ పువ్వు, ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి.
- అంతే ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటే సేమియా పాయసం ప్రసాదం రెడీ!
- టైమ్ తక్కువగా ఉన్న సమయంలో ఇలా పాయసం ప్రిపేర్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది. ఈ సేమియా పాయసం ఒక కప్పు తింటే ఇంట్లో వాళ్లు మరొక కప్పు కావాలంటారు.
































