శీతాకాలం స్టార్ట్ కావడంతో మార్కెట్లోకి ఉసిరికాయలు విరివిగా వస్తుంటాయి. ఈ క్రమంలోనే చాలా మంది ఉసిరితో పచ్చడి నుంచి పప్పు వరకు రకరకాల రెసిపీలు ట్రై చేస్తుంటారు. మీరు ఉసిరితో ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే, మీకోసమే ఒక స్పెషల్ రెసిపీని తీసుకొచ్చాం. అదే, నోరూరించే “ఉసిరికాయ పులిహోర”. నార్మల్‌గా మనందరం నిమ్మకాయ, చింతపండు వంటి వాటితో ఎక్కువగా పులిహోర చేసుకుంటుంటాం. కానీ, ఒకసారి ఈ సీజన్లో దొరికే ఉసిరితో ఇలా ‘పులిహోర‘ చేసి చూడండి.
ఇది ప్రత్యేకమైన టేస్ట్‌తో ఆహా అనిపిస్తుంది. పిల్లల లంచ్‌బాక్స్‌లోకి కూడా ఈ పద్ధతిలో ఉసిరి అన్నం చేసి పెట్టారంటే మెతుకు మిగల్చకుండా కమ్మగా, కడుపునిండా తినేస్తారు! అలాగే, దీని తయారీకి ఎక్కువ టైమ్ కూడా పట్టదు. చాలా తక్కువ టైమ్‌లో ఇన్‌స్టంట్‌గా రెడీ చేసుకోవచ్చు. మొదటిసారి చేసేవారైనా ఈ కొలతలతో చేశారంటే పర్ఫెక్ట్ టేస్ట్‌తో అదుర్స్ అనిపిస్తుంది. మరి, సూపర్ టేస్టీగా ఉండే ఉసరికాయ పులిహోరకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- బియ్యం – ఒక కప్పు
- నూనె – మూడు చెంచాలు
- పల్లీలు – మూడు చెంచాలు
- ఉసిరికాయలు – నాలుగు
- తాలింపు దినుసులు – ఒకట్రెండు టేబుల్‌స్పూన్లు
- ఉప్పు – రుచికి తగినంత
- పసుపు – కొద్దిగా
- ఇంగువ – అరటీస్పూన్
- ఎండుమిర్చి – నాలుగైదు
- కరివేపాకు – ఒకట్రెండు రెమ్మలు
-
తయారీ విధానం :
- ఈ నోరూరించే ఉసిరికాయ పులిహోర తయారీ కోసం ముందుగా ఒక గిన్నెలో బియ్యం తీసుకుని కడిగి ఆపై తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి.
- అయితే, ఇక్కడ అన్నంను మరీ మెత్తగా కాకుండా కాస్త పొడిపొడిలాడేలా వండుకోవాలి.
- అన్నం ఉడికేలోపు రెసిపీలోకి కావాల్సిన ఉసిరికాయలను గింజలు తీసేసి శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
- తర్వాత మిక్సీ పట్టుకున్న ఉసిరి పేస్ట్‌లో రుచికి తగినంత ఉప్పు వేసి అంతా కలిసేలా కలపాలి.
- ఇప్పుడు పొడిపొడిగా ఉడికించుకున్న అన్నంను ఒక వెడల్పాటి ప్లేట్ లేదా బేషన్లోకి తీసుకోవాలి. ఆపై అందులో ఉప్పు కలిపిపెట్టుకున్న ఉసిరి పేస్ట్‌ను వేసి అది రైస్‌లో చక్కగా కలిసిపోయేలా మిక్స్ చేసుకుని పక్కనుంచాలి.
- అనంతరం స్టవ్ మీద కడాయిలో నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత పల్లీలు వేసి దోరగా వేయించాలి.
- పల్లీలు లైట్‌గా వేగాక తాలింపు దినుసులు(ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు) వేయించుకోవాలి.
- ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు ఎండుమిర్చి, పసుపు, ఇంగువ, కరివేపాకు వేసి తాలింపును చక్కగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- తర్వాత ఈ తాలింపును ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నంలో వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుంటే చాలు. అంతే, సరికొత్త రుచితో ఘుమఘుమలాడే “ఉసిరికాయ పులిహోర” రెడీ అవుతుంది!
- మరి, నచ్చితే మీరు చింతపండు, నిమ్మకాయకు బదులుగా ఒకసారి ఇలా ఉసిరి పులిహోర ట్రై చేయండి. అటు మంచి రుచితో ఇటు ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటారు! పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ లొట్టలేసుకుంటూ తింటారు!




































