“ఆంజనేయ వడలు” – రేపు హనుమాన్ జయంతి – స్వామి వారికి వడలు ఇలా చేసి మాల వేయండి

 మినప వడలు, వడమాల అనగానే ఆంజనేయ స్వామి గుర్తుకొస్తారు. ఈ నెల 22న హనుమాన్ జయంతి. స్వామి వారికి వడమాల సమర్పించాలని, స్వయంగా చేసి నైవేద్యంగా సమర్పించడం వల్ల శుభం జరుగుతుందని భక్తుల నమ్మకం. అలాంటి కరకరలాడే గట్టి వడలు తయారు చేయాలనుకుంటున్నారా? అయితే, ఈ రెసిపీ ఫాలోచేయండి. ఇలా చేసిన వడలు దాదాపు వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి.


వడమాల కోసం మూడు వరుసల దారం తీసుకుని పసుపు రాసి 9, 11, 18 అంతకు మించి 108 వడలు కూడా మాల కట్టి స్వామి వారికి సమర్పించవచ్చు. ఇవి ఎయిర్​ టైట్ డబ్బాలో పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి.

కావాల్సిన పదార్థాలు :

  • పొట్టు మినప్పప్పు – 2 కప్పులు
  • జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
  • మిరియాలు – 1.5 టేబుల్ స్పూన్
  • ఇంగువ – అర టీ స్పూన్
  • ఉప్పు – రుచికి సరిపడా
  • బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్లు
  • నూనె – ­3 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం :

  • వడల తయారీ కోసం ముందుగా 2 కప్పుల పొట్టు మినప్పప్పు తీసుకుని రెండు, మూడు సార్లు శుభ్రం చేసుకుని గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. వీటిని మరీ ఎక్కువగా నానబెట్టాల్సిన పన్లేదు. ఆంజనేయ వడలు పొట్టుతోనే చేస్తారు కాబట్టి పూర్తిగా పొట్టు ఉంచుకుని వడలు చేసుకోవచ్చు. కావాలనుకుంటే పది శాతం పొట్టు తీసేసుకోవచ్చు.
  • నానబెట్టుకున్న పప్పును నీళ్లు వడగట్టుకుని క్లాత్ పై పోసుకుని పది నిమిషాల పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి.
  • ఈ లోగా మిక్సీలో జీలకర్ర, మిరియాలు వేసుకుని కోర్స్ గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి
  • అదే జార్ లో మినప్పప్పు మొత్తం ఒకే సారి కాకుండా పల్స్ ఇచ్చుకుంటూ గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి.
  • మిగిలిన పప్పు కూడా గ్రైండ్ చేసుకుని పక్కన గిన్నెలోకి తీసుకోవాలి.

మినప్పప్పు మిశ్రమంలో గ్రైండ్ చేసుకున్న జీలకర్ర, మిరియాల పొడి వేసుకోవాలి. ఇందులోనే అర టీ స్పూన్ ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నపుడు చాలా గట్టిగా ఉన్నా చేతులకు అతుక్కుపోతుంది కాబట్టి రుచి, కరకరలాడేందుకు ఈ సమయంలోనే 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బియ్యం పిండి వేసుకోవడం వల్ల వడలు క్రిస్పీగా వస్తాయి.

  • ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ల వేడి వేడి నూనె పోసుకుని గరిటెతో బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
  • మరో వైపు వడలు కాల్చుకోవడానికి వీలుగా పొయ్యిపై కడాయి పెట్టుకుని సరిపడా నూనె పోసుకోవాలి.
  • నూనె వేడెక్కేలోగా కాటన్ క్లాత్ నీళ్లలో పిండుకుని క్లాత్ పై వడలు వత్తుకుని నూనెలో వేసుకుంటే సరిపోతుంది.
  • వడలు చేతికి అంటుకోకుండా కొద్దిగా నూనె రాసుకుని వత్తుకోవాలి. నూనెలో వేసుకున్నాక ఓ వైపు కాల్చుకుని మరో వైపు తిప్పుకుని వేయించుకోవాలి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.