లడ్డూలలో బెలెడు వెరైటీలు ఉంటాయి. దేని ప్రత్యేకత దానిదే. అయితే కొన్ని లడ్డూలు మాత్రం వెరీ వెరీ స్పెషల్ గా ఉంటాయి. ఇవి టేస్టీగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
అలాంటివాటిల్లో ఒకటి పూల్ మఖానా లడ్డూ(phool makhana laddu). వంద రోగాలను సైతం నయం చేసే శక్తి పూల్ మఖానా లడ్డూకి ఉందని అంటుంటారు. ముఖ్యంగా ఎదిగేపిల్లలు ఈ లడ్డూ రోజుకి ఒకటి తింటే చాలామంచిది. ఎందుకంటే ఈ లడ్డూతో వారికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి.
ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కూడా అధికంగా వేసాము కాబట్టి ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ ఆరోగ్యకరమైన లడ్డూని ఈజీగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. పూల్ మఖానా లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
పూల్ మఖానా లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు
-పూల్ మఖానా
-బెల్లం
-జీడిపప్పు
-బాదంపప్పు
-నెయ్యి
-ఎండుకొబ్బరి పొడి
-యాలకులు
పూల్ మఖానా లడ్డూ తయారీ విధానం
-ముందుగా వెడల్పాటి పాన్ ని స్టవ్ మీద పెట్టుకొని అందులో 5 కప్పులు పూల్ మఖానా(లోటస్ సీడ్స్) వేసి లో మఖానా క్రిస్పీగా వచ్చేవరకు లో ప్లేమ్ మీద 4 నిమిషాలు వేపుకోండి.
-తర్వాత వీటిని ఓ ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వండి.
-ఇప్పుడు స్టవ్ మీద అదే పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఒక కప్పు బాదంపప్పు,ఒక కప్పు జీడిపప్పు వేసి లో ప్లేమ్ మీద దోరగా వేయించుకోండి.
-తర్వాత అందులో ఒక కప్పు సన్నగా తరిగిన ఎండుకొబ్బరి వేసుకోండి. కొంచెం వేగిన తర్వాత వీటిని తీసుకొని ఓ ప్లేట్ లో వేసి చల్లారనివ్వండి.
-ఇప్పుడు అదే పాన్ ని స్టవ్ మీద పెట్టి అందులో ఒకటిన్నర కప్పు బెల్లం వేసి అందులో అర కప్పు నీళ్లు పోసి బెల్లం పూర్తిగా కరిగి పాకం వచ్చేలా చూసుకోండి. జిగురు జిగురుగా వచ్చేంతరకు కలుపుతూ బెల్లాన్ని కరగనివ్వాలి.
-బెల్లం పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకాన్ని పూర్తిగా చల్లారనివ్వండి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో ప్లేట్ లో చల్లారబెట్టి ఉంచిన పూల్ మఖానాని,7 యాలకలు వేసి మెత్తడి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఆ పౌడర్ ని ఓ గిన్నెలోకి తీసుకొని పక్కనపెట్టుకోండి.
-తర్వాత వేయించి ఉన్న జీడిపప్పు,బాదంపప్పు,ఎండుకొబ్బరి మిశ్రామాన్ని మిక్సీ గిన్నెలో వేసి కాస్త పలుకులుగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి.
-తర్వాత ఈ డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని కూడా పూల్ మఖానా పిండిలో వేసి కలపండి.
-తర్వాత ఇందులోనే ముందుగా రెడీ చేసుకున్న బెల్లం పాకం వేసి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలిసిపోయేలా కలుపుకోండి.
-తర్వాత నేతిలో వేయించిన జీడిపప్పు,బాదంపప్పులు కొన్ని వేసుకొని కలుపుకోండి. తర్వాత వాటిని లడ్డూలాగా ఉండలు చుట్టుకోండి.