Maldives-Lakshadweep Controversy: ఒక్క తుపాకీ పేలలేదు. ఒక్క సైనికుడూ బోర్డర్ దాటలేదు. ఒక్క చుక్క రక్తం కారలేదు. అయినా చైనాకు గిలగిలమని కొట్టుకుంటోంది.
మాల్దీవుల భుజాలపై తుపాకీ పెట్టి మనల్ని టార్గెట్ చేద్దామనుకుంది. యుద్ధం చేయకుండానే మనల్ని చావుదెబ్బ కొడదామనుకుంది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా భారత్ ను ఉక్కిరిబిక్కిరి చేయాలనుకుంది. యుద్ధం పేరుతో అది భయపెడితే.. రాజనీతితో మనం చెక్ పెడుతున్నాం. యుద్ధ రంగంలో అది కాలుపెడితే.. చదరంగ రీతిలో మనం జస్ట్ చేయి పెట్టి చెక్ పెట్టాం. ప్రపంచానికి పాఠాలు నేర్పించిన విశ్వవిద్యాలయాలు ఉన్న గడ్డ ఇది. ఆ విషయం దానికి తెలియక కాదు. ఇప్పుడు ఇజ్రాయెల్ లక్షద్వీప్ విషయంలో ముందుకు వచ్చేసరికీ దానికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయ్యింది. కక్కాలేక, మింగాలేక, ఊపిరాడక గింజుకుంటోంది. నిజానికి ఇప్పుడున్న సమస్య మాల్దీవులు Vs లక్షద్వీప్ కాదు. చైనా Vs భారత్.
మన విదేశాంగరీతి మనకు అందర్నీ స్నేహితులను చేస్తుంది. కానీ దాని విదేశాంగ నీతి.. డ్రాగన్ కు అందర్నీ శత్రువులుగా మారుస్తోంది. అందుకే మనల్ని దెబ్బకొట్టాలన్నది దాని ప్లాన్. దీనికోసం మన ఇరుగుపొరుగు దేశాలతో మనకు శత్రుత్వం కలిగేలా స్కెచ్ వేసింది. శ్రీలంక, నేపాల్, మాల్దీవులు.. ఇవన్నీ మనపై కస్సుబుస్సులాడడం వెనుక చైనా ఎత్తులు, కుయుక్తులు ఉన్నాయి. మాల్దీవుల వ్యూహంతో మనల్ని రచ్చరచ్చ చేయాలనుకుంది. కానీ అది ఊహించని రీతిలో మన ప్రధాని నరేంద్రమోదీ లక్షద్వీప్ స్కెచ్ ముందు అది తేలిపోయింది. ఒక్కసారిగా షాకైంది. అది తేరుకునే లోపే.. భారత్ లో అందరి స్వరం పెరిగింది. దాంతో మాల్దీవులకు జ్వరం వచ్చింది. డ్రాగన్ ఇచ్చే పారసిటమాల్ టాబ్లెట్ కూడా ఆ ఫీవర్ ను తగ్గించలేదు. పైగా ఇప్పుడు లక్షద్వీప్ లో డీశాలినేషన్ ప్రాజెక్టు విషయంలో సాయం చేయడానికి ఇజ్రాయిల్ మళ్లీ ముందుకొచ్చింది. దీనిని బట్టి లక్షద్వీప్ ఇష్యూ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిందని అర్థమవుతోంది.పైగా ఇజ్రాయెల్ రాకతో.. మనకు ప్రపంచ దేశాల మద్దతు మొదలైనట్టే. అదే చైనాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
డీశాలినేషన్ ప్రాజెక్ట్ చేపట్టాలని మనం ఇజ్రాయెల్ ను గతంలో కోరాం. కిందటి ఏడాది ఆ దేశం నుంచి ఓ టీమ్ లక్షద్వీప్ కు వచ్చింది. అన్నీ చూసింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పై వర్క్ చేయడానికి రెడీగా ఉంది. ఆ విషయాన్నే చెబుతూ.. లక్షద్వీప్ బ్యూటీ ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించింది. దీనికోసం కొన్ని ఫోటోలను కూడా ఇజ్రాయెల్ ఎంబసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
లక్షద్వీప్ సెగ మాల్దీవులకు తగిలిన వెంటనే.. ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జు చైనాకు వెళ్లారు. అయిదు రోజుల పాటు అక్కడ పర్యటించారు. చైనా అధ్యక్షుడితో మంతనాలు జరిపారు. సరే.. ఆ రెండు దేశాల మధ్య ఏం చర్చలు నడిచాయి అన్నది పక్కన పెడితే… టూర్ ముగింపులో మాల్దీవుల అధ్యక్షుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాళ్ల దేశాన్ని విమర్శించే రైట్ ఎవరికీ లేదంటూ.. ఇన్ డైరెక్ట్ గా మనల్ని ఉద్దేశించి అన్నారు. వాళ్లది చిన్న దేశమే అయినా.. వాళ్లను అవమానించడానికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వడం లేదు అన్నారు. నిజానికి ఏ దేశానికి మరో దేశాన్ని విమర్శించే అధికారం, హక్కు లేవు. కానీ ఇక్కడ వాళ్లను వాళ్లే అవమానించుకుంటున్నారు అన్న సంగతిని ముయిజ్జు మర్చిపోయినట్టుంది. వాళ్ల మంత్రుల నోటీ దురుసు వల్లే కదా.. పరిస్థితి ఇంతవరకూ వచ్చింది. ఇప్పటికి దానికి ఒక్క విషయం అర్థమైనట్టుంది. మననుంచి టూరిజం సపోర్ట్ తగ్గిపోతుందని ఊహించి.. చైనా నుంచి పర్యాటకులను ఎక్కువగా పంపించాలని.. ఆ దేశాధ్యక్షుడు జిన్ పింగ్ ని కోరింది. ఇప్పుడు ఎవరు ఎవరితో ఉన్నారో ఈజీగా అర్థమవుతుంది.
మనకు ఎవరూ శత్రువులు లేరు. మనం ఎవరికీ శత్రువు కాదు. మన జోలికొస్తే మనం ఊరుకోం. ఇతర దేశాల విషయంలో మనం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. చేసుకోబోము. కానీ చైనా అలా కాదు.. తన చుట్టుపక్కల దేశాలన్ని తన చెప్పుచేతల్లోనే ఉండాలని.. తన మాటనే వినాలని కోరుకుంటోంది. మన దగ్గర దాని ఎత్తులు, జిత్తులు పనిచేయవు. అందుకే ఓ వ్యూహం ప్రకారం.. మన ఇరుగుపొరుగు దేశాలతో సఖ్యత పెంచుకుని.. సాయం పేరుతో వాటిని చేరదీసి.. మనపైకి ఉసిగొల్పుతోంది. అందుకే మోదీ సర్కార్ చాలా తెలివిగా.. చైనా కంట్లో మాల్దీవుల కారం కొట్టింది. మరి.. కంటిమంటతో కామ్ అవుతుందో.. మరో వ్యూహంతో ముందుకొస్తుందో చూద్దాం. రాజనీతి అయినా, చదరంగ రీతి అయినా చాణక్యుడు పుట్టిన గడ్డ ఇది అని మర్చిపోవద్దు డ్రాగన్.