సమ్మర్‌లో వచ్చే మామిడి కాయల గురించి ఏడాది అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. పుల్ల పుల్లగా, తియ్యగా చాలా రుచిగా ఉంటాయి మామిడి కాయలు. అందులోనూ చిన్న పిల్లలు ఉంటే..
ఎన్ని మామిడి కాయలు తెచ్చినా సరిపోవు. మామిడి కాయలతో ఎన్నో రకాల వెరైటీలు తయారు చేస్తూ ఉంటారు. ఎక్కువగా మామిడి కాయతో రకరకాల పచ్చళ్లు పెడతారు. అలాగే పలు రకాల వంటల్లో కూడా ఉపయోగిస్తారు. మామిడి కాయలతో స్వీట్లు కూడా తయారు చేస్తూ ఉంటారు. అలాగే ఎక్కువగా మ్యాంగో మురబ్బా తయారు చేస్తారు. చాలా మందికి ఇది తెలుసు. కానీ తయారు చేయడం రాదు. ఈ రెసిపీ చేయడం చాలా సులువు. ఇది తయారు చేయడానికి కేవలం పుల్లగా ఉండే మామిడి కాయలను మాత్రమే ఎంచుకోవాలి. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మ్యాంగో మురబ్బా తయారీకి కావాల్సిన పదార్థాలు:
మామిడి కాయలు, యాలకులు, పంచదార, బెల్లం తురుము, బ్లాక్ సాల్ట్, కారం, జీలకర్ర పొడి.
మామిడి కాయ మురబ్బా తయారీ విధానం:
మామిడి కాయల మురబ్బా తయారు చేయడానికి పుల్లగా ఉండే మామిడి కాయల్ని ఎంచుకోవాలి. అలా అయితేనే ఈ రెసిపి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. రుచి కూడా పర్ ఫెక్టుగా వస్తుంది. ముందుగా మామిడి కాయలపై ఉండే పొట్టును తీసేయాలి. ఆ తర్వాత సన్నగా తురిమి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి చిన్న మంట పెట్టాలి. ఆ తర్వాత ఇందులోనే మామిడి కాయ తురుము వేయాలి. ఇప్పుడు బెల్లం తురుము కూడా వేసి.. బాగా కలపాలి. పంచదార వేసి.. మొత్తం మిశ్రమాన్ని బాగా ఉడికించాలి.
ఇప్పుడు ఇది హల్వాగా తయారవుతుంది. ఈ సమయంలో ఇందులో కారం, ఉప్పు, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. ఇదంతా దగ్గర పడ్డాక.. చిన్న మంట మీద ఉడికించి.. బెల్లం తీగ పాకంలా సాగుతున్నట్టు అవుతుంది. ఈ సమయంలో స్టవ్ ఆఫ్ చేయాలి. చివరగా యాలకుల పొడి వేసుకోవాలి. కావాలి అనుకునేవారు డ్రైఫ్రూట్స్ కూడా నేతిలో వేయించి వేసుకోవచ్చు. అంతే ఎంతో రుచిగా ఉండే మ్యాంగో మురబ్బా రెడీ. ఈ రెసిపీ పిల్లలకు బాగా నచ్చుతుంది.