NEET: 410 మార్కులొస్తే కన్వీనర్‌ కోటాలో ఎంబీబీఎస్‌ సీటు

నీట్‌ ఫలితాల వెల్లడితో విద్యార్థులు తమకు ఏ కాలేజీలో సీటు వస్తుందా అని లెక్కలు వేసుకుంటున్నారు. తమకు వచ్చిన ర్యాంకు, మార్కులు, సామాజికవర్గాల ఆధారంగా ఏ విద్యాసంస్థలో ఎంబీబీఎస్‌ ప్రవేశం దక్కుతుందనేదానిపై అంచనాలు రూపొందించుకుంటున్నారు. త్వరలోనే ప్రారంభమవనున్న ఆలిండియా కోటా సీట్ల కౌన్సెలింగ్‌కు మన రాష్ట్ర విద్యార్థులు సైతం పోటీపడనున్నారు. ఈ క్రమంలో ప్రతిభావంతులైన విద్యార్థులు కాకుండా మిగిలిన వారికి ఎన్ని మార్కులు వస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కన్వీనర్‌ కోటాలో సీటు వస్తుందన్న దానిపై నీట్‌ నిపుణులు విశ్లేషణలు విడుదల చేశారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 34కు చేరుకుంది. వాటిలో సీట్ల సంఖ్య 4090కు పెరిగింది. ఇందులో 15 శాతం సీట్లు అఖిల భారత కోటాకు వెళ్తాయి. అలాగే ఎయిమ్స్‌ బీబీనగర్‌లో 100, ఈఎ్‌సఐ సనత్‌నగర్‌లో 150 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. ఇక ప్రైవేటులో 30 కాలేజీలు, 4600 సీట్లు ఉన్నాయి. ఇందులో కొన్ని కాలేజీలు గత ఏడాది డీమ్డ్‌ వర్సిటీలుగా మారాయి. వాటిలోని సీట్లు రాష్ట్ర పరిధిలోకి రావు. ప్రైవేటులో ఉన్న సీట్లలో 50 శాతం కన్వీనర్‌ కోటా కిందకు వస్తాయి. కాళోజీ యూనివర్సిటీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 5500 వరకు కన్వీనర్‌ కోటా సీట్లున్నాయి.


410 మార్కులొస్తే కన్వీనర్‌ కోటాలో అవకాశం

ఈ ఏడాది 22.09 లక్షల మంది నీట్‌ పరీక్ష రాయగా.. 12.36 లక్షల మంది అర్హత సాధించారు. తెలంగాణ నుంచి 70259 మంది పరీక్ష రాయగా.. 41584 మంది ఉత్తీర్ణులయ్యారు. నిరుటితో పోలిస్తే ఈ సారి రాష్ట్రం నుంచి నీట్‌ రాసే వారి సంఖ్య 8 వేలు తగ్గింది. ఏపీ నుంచి 57 వేల మంది రాయగా.. 36 వేల మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది నీట్‌ పరీక్ష కఠినంగా రావడంతో విద్యార్థుల మార్కులు కూడా బాగా తగ్గాయి. గత ఏడాది దాదాపు 1500 మంది విద్యార్థులు 720కి గాను 700పైగా మార్కులు సాధించారు. ఈ ఏడాది జాతీయ స్థాయిలో 686 మార్కులే అత్యధికం. అలాగే 600కు పైగా స్కోర్‌ చేసిన వారు కేవలం 1250 మందే. దీన్నిబట్టి ప్రశ్నపత్రం ఎంత కఠినంగా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇక నీట్‌ రాసిన వారిలో 400 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు సుమారు 2 లక్షల మంది ఉంటారని అంచనా. నిరుటితో పోలిస్తే దేశవ్యాప్తంగా విద్యార్థులు సాధించిన మార్కులు భారీగా తగ్గాయి. మన రాష్ట్రంలో జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు కన్వీనర్‌ కోటాలో సీటు దక్కాలంటే 410-425 మార్కులు రావాలని నిపుణులు చెప్పారు. ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో 410 మార్కులు వచ్చిన వారికి అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఏయూ పరిఽధిలో జనరల్‌ కేటగిరీలో 475-480 మార్కులు, ఎస్వీయూ పరిధిలో 465-470 వచ్చిన వారికి కన్వీనర్‌ కోటా సీటు దక్కే అవకాశం ఉందని తెలిపారు. కాగా, ఈ ఏడాది జనరల్‌ కేటగిరీలో కటాఫ్‌ మార్కులు 144గా, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 113గా నిర్ణయించారు.

తొలుత ఆలిండియా కోటా కౌన్సెలింగ్‌

దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లలో 15 శాతం ఆలిండియా కోటాకు వెళ్తాయి. దేశవ్యాప్తంగా 20 ఎయిమ్స్‌ ఉన్నాయి. వీటిలో 2044 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. జిప్‌మర్‌ పుదుచ్చేరి, కరైకల్‌లో కలిపి 200సీట్లున్నాయి. అఖిల భారత కోటా కౌన్సెలింగ్‌ రెండు దఫాల్లో నిర్వహిస్తారు. సీటు వచ్చిన విద్యార్థులు తప్పనిసరిగా చేరాల్సి ఉంటుంది. ఈ కోటాలో సీటు వచ్చిన విద్యార్థులు రాష్ట్ర కౌన్సెలింగ్‌లో పాల్గొనడం కుదరదు. ఆలిండియా కోటా ముగిసిన తర్వాత రాష్ట్ర పరిధిలోని హెల్త్‌ యూనివర్సిటీ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుంది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లన్నీ కన్వీనర్‌ కోటాలోకి వస్తాయి. ప్రైవేటులోని సీట్లలో 50ు కన్వీనర్‌ కోటా కిందకు వస్తాయి. మిగిలిన 50ు సీట్లలో 35ు బీ కేటగిరీ (యాజమాన్య), మరో 15ు సీ కేటగిరీ (ఎన్‌ఆర్‌ఐ) కోటాకు వెళ్తాయి. వీటికీ హెల్త్‌ వర్సిటీనే కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుంది.

ఎయిమ్స్‌లో సీటుకు 560 పైగా స్కోర్‌ చేయాలి

జనరల్‌ కేటగిరీలో ఏదైనా ఎయిమ్స్‌లో సీటు రావాలంటే నీట్‌లో కనీసం 560 మార్కులకుపైగా స్కోర్‌ చేయాల్సి ఉంటుంది. ఢిల్లీ ఎయిమ్స్‌లో అయితే 650 పైగా రావాలి. మన రాష్ట్రంలోని బీబీనగర్‌ ఎయిమ్స్‌లో కటాఫ్‌ మార్కులు 580గా ఉండే అవకాశం ఉంది. మంగళగిరి ఎయిమ్స్‌లో 600గా ఉండే చాన్స్‌ ఉంది. అదే విధంగా ఆలిండియా కోటాలో జనరల్‌ కేటగిరీలో సీటు రావాలంటే ఆలిండియా ర్యాంకు సుమారు 23-25 వేల మధ్యలో ఉండాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.