ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ ఆన్‌లైన్ రాత పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. దాదాపు 154 పరీక్ష కేంద్రాల్లో రోజుకు 2 షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి.
ఇక ఈ పరీక్షలను తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు జూన్ 30వ తేదీతో ముగియాల్సి ఉంది. అయితే జూన్ 20, 21 తేదీల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాల వల్ల ఈ తేదీల్లో నిర్వహించవల్సిన పరీక్షలను వాయిదా వేస్తూ తాజాగా విద్యాశాఖ ప్రకటన కూడా జారీ చేసింది. ఈ పరీక్షలను జులై 1, 2 తేదీలకు మార్పు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో జులై 2 వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి.
ఇక ఇప్పటికే పలు పరీక్షలు పూర్తి చేసిన విద్యాశాఖ.. తాజాగా డీఎస్సీ గణితం సబ్జెక్టుకు సంబంధించిన ఆన్‌లైన్ రాత పరీక్షల ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ని వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్ధుల రెస్పాన్స్‌షీట్స్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ లాగిన్ వివరాలు నమోదు చేసి, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక ప్రాథమిక ఆన్సర్ ‘కీ’పై అభ్యంతరాలను జూన్ 24లోపు తగిన ఆధారాలతో డీఎస్సీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో పంపించాలని కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి సూచించారు. ప్రాథమిక ‘కీ’పై వచ్చిన అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఆన్సర్ కీ రూపొందించి, ఆపై ఫలితాలను కూడా విడుదల చేస్తారు.
కాగా ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షలు ఏపీతో సహా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. మెగా డీఎస్సీలో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,36,305 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కొక్కరు మూడు, నాలుగు పోస్టులకు దరఖాస్తు చేయడంతో దరఖాస్తులు దాదాపు 5,77,675 వరకు వచ్చాయి.