Cash Transaction Rules: ప్రస్తుత ప్రపంచంలో చిన్న మెుత్తాల నుంచి పెద్ద అమౌంట్స్ వరకు డబ్బును డిజిటల్ రూపంలోనే చెల్లింపులు జరుగుతున్నాయి. అందువల్ల ఇంట్లోవాళ్లతో సైతం యూపీఐ చెల్లింపుల ద్వారానే చాలా మంది డబ్బును చేతులు మార్చుకుంటున్నారు.
తండ్రి-కొడుకుల మధ్య లేదా భార్యా-భర్తల మధ్య కూడా డబ్బు లావాదేవీలు జరుపుతున్నట్లయితే ఈ వార్త ఖచ్చితంగా మీకోసమే. నిజానికి మనం చేసే ప్రతి చెల్లింపుపైనా ఆదాయపు పన్ను అధికారుల కన్ను ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇలాంటి తరుణంలో ఇంట్లోనివారితో చేసే నగదు లావాదేవీలపై కూడా ఆదాయపు పన్ను నోటీసులు వస్తాయా..? అనే అనుమానం చాలా మందిలో ప్రస్తుతం ఉంది. అసలు వీటికి సంబంధించిన పన్ను చట్టంలోని రూల్స్ ఏమని చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు ఇంటి ఖర్చుల కోసం ప్రతి నెలా డబ్బు ఇస్తే లేదా డబ్బును బహుమతిగా ఇస్తే.. అప్పుడు భార్య ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని పన్ను అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో రెండు రకాల మొత్తాలను భర్త ఆదాయంగా పరిగణిస్తారు. ఇలాంటి సందర్భంలో భార్యకు ఎలాంటి ఆదాయపు పన్ను నోటీసులు రావు. అయితే భార్య ఈ మెుత్తాన్ని వేరే దగ్గర పెట్టుబడిగా పెట్టి దాని నుంచి ఆదాయాన్ని పొందినట్లయితే అప్పుడు వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది వారీగా లెక్కించిన పెట్టుబడి ఆదాయాన్ని భార్య ఆదాయంగా పరిగణిస్తారు.
ఆదాయపు పన్ను సెక్షన్ 269SS, 269T కింద రూ.20 వేల కంటే ఎక్కువ నగదు లావాదేవీలపై జరిమానా విధించవచ్చు. అయితే చాలా సందర్భాలలో ఇందులో సడలింపులు ఉన్నాయి. ఉదాహరణకు.. తండ్రి-కొడుకు, భర్త-భార్య లేదా కొంతమంది దగ్గరి బంధువుల మధ్య లావాదేవీలపై ఎటువంటి జరిమానా ఉండదు. పన్ను చట్టాల్లో ఇందుకోసం ప్రత్యేకంగా మినహాయింపు ఇవ్వబడింది. అంటే ఇంట్లోని వారి మధ్య జరిగే డబ్బు చెల్లింపులపై ఆదాయపు పన్ను అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వరన్నమాట. అయితే ఆ డబ్బును పెట్టుబడిగా ఉంచి ఆదాయాన్ని సంపాదిస్తే మాత్రం పన్ను తప్పకుండా చెల్లించాల్సిందే.