గుజరాత్ కు చెందిన ప్రసిద్ధ వంటకం ఢోక్లా ఒకటి. మెత్తగా, స్పాంజిలా ఉంటూ, పుల్లపుల్లగా, తియ్యతియ్యగా ఉండే ఈ వంటకాన్ని ఇష్టపడని వారుండరు. సాధారణంగా ఢోక్లాను శనగపిండితో తయారుచేస్తారు.
అయితే ఈ ఢోక్లాను పోషకాల గని అయిన రాగితో తయారుచేసుకుంటే? ఆ రుచే వేరు, దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలే వేరు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక ఉత్తమమైన ఆహారం.
కావలసిన పదార్థాలు
రాగి పిండి – 1 కప్పు
బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ) – పావు కప్పు
పుల్లటి పెరుగు – ముప్పావు కప్పు
అల్లం-పచ్చిమిర్చి పేస్ట్ – 1 టీస్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – చిటికెడు
ఈనో ఫ్రూట్ సాల్ట్- 1 టీస్పూన్ లేదా అర టీస్పూన్ బేకింగ్ సోడా
నీరు – సుమారు అర కప్పు
నూనె – 2 టీస్పూన్లు
ఆవాలు – 1 టీస్పూన్
జీలకర్ర – అర టీస్పూన్
పచ్చిమిర్చి – 2
తెల్ల నువ్వులు – 1 టీస్పూన్
కరివేపాకు – రెండు రెమ్మలు
ఇంగువ – చిటికెడు
చక్కెర – 1 టీస్పూన్
నిమ్మరసం – 1 టీస్పూన్
నీరు – 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుము – గార్నిషింగ్ కోసం
తయారీ విధానం
-ఒక పెద్ద గిన్నెలో రాగి పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, పసుపు వేసి బాగా కలపండి.
-ఇప్పుడు అందులో పెరుగు, అల్లం-పచ్చిమిర్చి పేస్ట్ వేయండి. కొద్దికొద్దిగా నీరు పోసుకుంటూ జారుగా ఉండేలా పిండిని తయారు చేసుకోండి.
-కలిపిన పిండిపై మూత పెట్టి సుమారు 20-30 నిమిషాల పాటు పక్కన పెట్టండి.
-ఇప్పుడు ఢోక్లా ఉడికించడానికి ఒక స్టీమర్ లేదా వెడల్పాటి గిన్నెలో కొన్ని నీళ్లు పోసి వేడి చేయడం ప్రారంభించండి. ఢోక్లా పిండిని వేయడానికి ఉపయోగించే ప్లేట్ కు లేదా గిన్నెకు నూనె రాసి సిద్ధంగా ఉంచుకోండి.
-20 నిమిషాల తర్వాత, పిండి మిశ్రమంలో ఈనో ఫ్రూట్ సాల్ట్ వేయండి. దానిపై ఒక టీస్పూన్ నీరు వేయగానే అది నురుగులా పొంగుతుంది. ఇప్పుడు నెమ్మదిగా ఒకటి రెండుసార్లు కలపండి.
ఈ పిండిని నూనె రాసిన ప్లేట్ లోకి మార్చండి. ఆ ప్లేట్ ను వేడెక్కుతున్న స్టీమర్ లో పెట్టి మూతపెట్టి మీడియం మంటపై 15-20 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించండి.
-ఢోక్లా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ ను బయటకు తీసి కొద్దిగా చల్లారనివ్వండి. ఈలోపు తాలింపు కోసం ఒక చిన్న పాన్ లో నూనె వేడి చేశాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, నువ్వులు, ఇంగువ వేసి వేయించండి.
-ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అందులో చక్కెర, నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల నీరు పోసి బాగా కలపండి.
-చల్లారిన ఢోక్లాను మీకు నచ్చిన ఆకారంలో చతురస్రాలు లేదా డైమండ్స్ ముక్కలుగా కట్ చేసుకోండి. సిద్ధం చేసుకున్న తాలింపును ఈ ముక్కలపై సమానంగా పరచండి.
-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుముతో అలంకరించి సర్వ్ చేసుకోవడమే.


































