‘తండేల్’తో మంచి విజయాన్ని అందుకున్న హీరో నాగచైతన్య, డైరెక్టర్ చందూ మొండేటి మరో సినిమాకి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని ‘తండేల్’ సక్సెస్ ఈవెంట్‌లో దర్శకుడు ప్రకటించారు.
ఆ వివరాలివీ..
”నాగార్జున సర్.. చైతన్యకు హిట్ రావడంపై మీరెంత సంతోషంగా ఉన్నారో నాకు తెలుసు. మీకంటే రెట్టింపు ఆనందంలో మేం (అభిమానులనుద్దేశిస్తూ) ఉన్నాం. ఇది మొదలు.. ఇకపై అన్ని సిక్సర్లే. ‘తండేల్’ కథను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అర్థం చేసుకున్నంతగా ఎవరూ అర్థం చేసుకోలేదు. ఈ స్టోరీ ఆయన మ్యూజిక్ రూపంలోనే తెరపైకి వచ్చింది. ఆ తర్వాత నన్ను బాగా నమ్మింది ఎడిటర్ నవీన్ నూలి. ఈ కథకు మేం ఎమోషనల్‌గా కనెక్ట్ అయినట్టే ప్రేక్షకులూ కనెక్ట్ అయ్యారు. గతంలో నేను తెరకెక్కించిన ‘సవ్యసాచి’ తర్వాత నిర్మాత బన్నీ వాసు నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చారు. అల్లు అరవింద్ గారిలో నాకు చాలా మంచి క్వాలిటీస్ కనిపించాయి. శోభిత (నటి, నాగచైతన్య భార్య) మీరు తెలుగు బాగా మాట్లాడతారు. ఆ తెలుగును మా హీరోకి కూడా ట్రాన్స్‌ఫర్ చేసేయండి. ఎందుకంటే మేం భవిష్యత్తులో.. హిస్టారికల్ మూవీ చేయబోతున్నాం. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘తెనాలి రామకృష్ణ’ సినిమాను ఈ తరానికి తగ్గట్టు తీర్చిదిద్దుతాం. ఏఎన్నార్ అంతటి అభినయం మళ్లీ నాగచైతన్య చేస్తారు. మనం చూడబోతున్నాం” అని అన్నారు.