అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వారికి, దళారుల చేతుల్లో పడకుండా రక్షించడానికి ఇండియన్ రైల్వేస్ తత్కాల్ రిజర్వేషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 1997 డిసెంబర్‌లో ప్రారంభమైన ఈ పథకం, ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడానికి అనేక సార్లు సవరించారు.
2025 సంవత్సరానికి గాను తత్కాల్ టికెట్ బుకింగ్ వివరాలు, సమయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తత్కాల్ టికెట్ బుకింగ్ నిబంధనలు
తత్కాల్ టికెట్లను దేశంలో ఎక్కడి నుంచైనా బుక్ చేసుకోవచ్చు. రైలుకు వర్తించే దూరం పరిమితికి లోబడి, ఎండ్-టు-ఎండ్ కాకుండా, ప్రయాణించే వాస్తవ దూరాన్ని బట్టి తత్కాల్ టికెట్లు జారీ చేస్తారు. ఒకే తత్కాల్ బెర్త్/సీటును చార్టుల తయారీ వరకు బహుళ దశల్లో బుక్ చేసుకోవచ్చు. కొన్ని రైళ్లు/తరగతులు/ప్రాంతాలకు తత్కాల్ కోటా అందుబాటులో ఉండకపోవచ్చు, కాబట్టి బుక్ చేసే ముందు లభ్యతను చెక్ చేసుకోవడం ముఖ్యం.
తత్కాల్ బుకింగ్ సమయాలు 2025
తత్కాల్ టికెట్ బుకింగ్ రైలు బయలుదేరే తేదీకి ఒక రోజు ముందుగా ప్రారంభమవుతుంది. రైలు బయలుదేరే స్టేషన్ నుండి ఈ సమయాన్ని లెక్కిస్తారు.
ఏసీ క్లాస్ (1AC/2AC/3AC/CC/EC/3E) టికెట్ల బుకింగ్ ఉదయం 10:00 గంటలకు ప్రారంభమవుతుంది.
నాన్-ఏసీ క్లాస్ (SL/FC/2S) టికెట్ల రిజర్వేషన్ ఉదయం 11:00 గంటలకు ప్రారంభమవుతుంది.
ఉదాహరణకు.. ఒక రైలు మే 21న బయలుదేరాల్సి ఉంటే, ఏసీ క్లాస్ తత్కాల్ బుకింగ్ మే 20న ఉదయం 10:00 గంటలకు, నాన్-ఏసీ క్లాస్ బుకింగ్ ఉదయం 11:00 గంటలకు ప్రారంభమవుతుంది.
తత్కాల్ టికెట్ బుకింగ్ విధానం
తత్కాల్ టికెట్లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో బుక్ చేసుకోవచ్చు.
ప్రయాణికులకు ఐఆర్సీటీసీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఉండాలి. ఏజెంట్ల ద్వారా కూడా తత్కాల్ రైలు టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
సమీపంలోని రైల్వే స్టేషన్లలోని పీఆర్‌ఎస్ (ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్) కౌంటర్లను సందర్శించాలి. తత్కాల్ కోటాతో పాటు లేడీస్ జనరల్ కోటాలను ఎంపిక చేసుకోలేరు.