భారతదేశంలో కొత్త కరోనా భయం..! XFG వేరియంట్ ఎంత ప్రమాదకరం?

భారత్‌లో మళ్లీ కరోనా కొత్త వేవ్‌ కనిపిస్తున్నది. రోజులు గడిచే కొద్ది కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ప్రస్తుతం కేసుల సంఖ్య 6,491 పెరిగింది.


గత 24గంటల్లోనే 358 కొత్త పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. ఈ కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్‌, దాని సబ్‌ వేరియంట్స్‌ ఎన్‌బీ1.8.1 కారణంగా తెలుస్తున్నది. తాజాగా ఎక్స్‌ఎఫ్‌జీ వేరియంట్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇండియన్‌ సార్స్‌ కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG) డేటా ప్రకారం.. దేశంలో ఈ వేరింట్‌ కేసులు 163 రికార్డయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 89 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తమిళనాడు (16), కేరళ (15), గుజరాత్ (11), ఆంధ్రప్రదేశ్ (6), మధ్యప్రదేశ్ (6), పశ్చిమ బెంగాల్ (6) కేసులు వెలుగు చూశాయి.

ది లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. రీకాంబినెంట్ ఎక్స్‌ఎఫ్‌జీ వేరియంట్‌లో నాలుగు కొత్త ఉత్పరివర్తనలు ఉన్నాయి. ఇవి వేగంగా వ్యాప్తి చెందడంతో పాటు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ వేరియంట్‌ను మొదట కెనడాలో గుర్తించారు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందింది. ఇంతకు ముందు ఈ వేరియంట్‌ కేసులో మే నెలలో 159 రికార్డయ్యాయి. అంతకుముందు ఏప్రిల్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు జూన్‌లో రెండు నమూనాల్లో ఈ వేరియంట్‌ సోకినట్లుగా తేలింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. భారతదేశంలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 6500 చేరుకుంది. ఈ క్రమంలో ఆరోగ్య నిపుణులు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. కరోనా నివారణపై శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు.

ఎక్స్‌ఎఫ్‌జీ వేరియంట్‌పై ప్రచురితమైన నివేదిక ప్రకారం.. ఈ వేరియంట్‌ LF.7, LP.8.1.2 నుంచి పుట్టుకువచ్చింది. నాలుగు ప్రధాన స్పైక్ మ్యుటేషన్‌లను కలిగి ఉంది. ఈ ఉత్పరివర్తనలు వేగంగా అభివృద్ధి చెందుతున్న వేరియంట్లటో ఒకటి. ప్రస్తుతం ఈ వేరియంట్‌ ఓమిక్రాన్ ఇతర ఉప-వేరియంట్ల తరహాలోనే తీవ్రమైన, ఆందోళనకరమైంది ఏమీ కాదు. దీని ప్రభావం వేగంగా వ్యాపిస్తుండడంతో నివారణ, అప్రమత్తంగా ఉండడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వేరియంట్‌పై చైనా నిపుణులు నిర్వహించిన అధ్యయనంలో ఇతర వేరియంట్లతో పాటు LP.8.1.1 వేరియంట్ కంటే XFG మరింత తీవ్రమైన అంటువ్యాధి కావొచ్చనని పేర్కొంది. ఇది భవిష్యత్తులో కరోనా వేగంగా వ్యాప్తి చెందడానికి కారణం కావొచ్చునని.. ఈ క్రమంలో అప్రమత్తత అవసరమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్‌, అమెరికా సహా ఇతర దేశాల్లోనూ ఈ వేరియంట్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇతర వేరియంట్ల మాదిరిగానే తేలికపాటి లక్షణాలు కనిపిస్తాయని.. వృద్ధులు, కోమోర్బిడిటీతో బాధపడుతున్న వ్యక్తుల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలిగించే ప్రమాదం ఉంటుందని నిపుణులు గుర్తించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.