పూజలు, హోమాలు అక్కర్లేదు.. మూగజీవాలకు ఈ ఆహారం పెడితే సిరి సంపదలు మీ వెంటే వస్తాయి

కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి పూర్వ జన్మలో చేసుకున్న కర్మలే ఈ జన్మలో సుఖ సంతోషాల రూపంలో వెంట వస్తుంటాయంటారు. వాటిని విష్ణుమూర్తి నవగ్రహాల రూపంలో మనకు అనుగ్రహిస్తాడని హిందూ శాస్త్రంలో బలంగా నమ్ముతారు.


నవగ్రహాలు ఎక్కడో ఉండవని.. అవి మన శరీరంలోనే ఉంటూ మన బుద్ధిని తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తుంటాయని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. అందుకే కొన్ని గ్రహాలు కొందరికి మంచి చేస్తే కొందరికి నష్టాలను తీసుకువస్తాయి. ఆరోగ్య సమస్యలు, ధన నష్టం, కోర్టు కేసుల వంటి కారణాలతో ఇబ్బంది పెడుతుంటాయి. ఈ బాధల నుంచి తప్పించుకునేందుకు రకరకాల పూజలు, హోమాలు చేస్తూ వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. కానీ, మన తలరాతను మార్చుకునే కొన్ని కిటుకులు పురాణాల్లోనే ఉన్నాయి. అందలో ఒకటే మూగజీవాలకు ఆహారం పెట్టడం. పక్షులు, జంతువులకు వివిధరకాల ఆహారాలను తినిపంచడం వల్ల మనకు తెలియకుండానే ఎన్నో దోషాలకు పరిహారం లభిస్తుందని చెప్తారు. మరి ఏ జీవికి ఎలాంటి ఆహారం పెడితే ఏయే గ్రహశాంతులు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇలా చేస్తే అదృష్టం మీవెంటే..

గ్రహాలకు రాజు సూర్యుడు. కాబట్టి ఆదివారం రోజు జంతువులు, పక్షులకు ఆహారాన్ని అందిచడం వల్ల మీ జాతకంలో రవిగ్రహం బలపడుతుంది. ముఖ్యంగా ఆదిరవారాలు కోతులకు గోధుమలు, బెల్లం, చపాతీ ఇవ్వడం ఎంతో మంచిది. ఇది మిమ్మల్ని అదృష్టవంతులను చేస్తుంది.

మానసిక సమస్యలకు సింపుల్ చిట్కా..

సోమవారం చంద్రుడికి ప్రత్యేకం. ఈ గ్రహం బాగాలేని వారు తీవ్రమైన మానసిక సమస్యలు, డిప్రెషన్, చిన్న విషయాలకే ఆందోళన వంటి సమస్యలు ఎదుర్కొంటారు. వీటి నుంచి విముక్తి పొందాలంటే మీరు చేయాల్సింది ఒక్కటే. సోమవారం రోజున తెల్ల ఆవుకు పిండి ముద్దలు చేసి తినిపించండి. వీలైతే అందులో కాస్త బెల్లాన్ని కూడా కలపండి. ఇది మీ జీవితాన్ని ప్రశాంతంగా మార్చేస్తుంది.

తెలివితేటలు పెరగాలంటే..

జంతువులకు ఆహారం అందివ్వడం వల్ల బుధుడు కూడా సంతృప్తి చెందుతాడు. ఆవులకు పచ్చగడ్డి, దాణా ఇవ్వడం, పంజరాల్లో ఉన్న పక్షులను విడుదల చేయడం లాంటివి చేయాలి. ముఖ్యంగా మంగళవారం నాడు ఈ పనులు చేయడం వల్ల సానుకూల ఫలితాలను అందుకుంటారు. పిల్లులకు పాలు అందించడం కూడా మంచిదే.

ఇలా చేస్తే ఎప్పుడూ డబ్బులు గలగలే..

శుక్రుడు ధన కారకుడు. మంచి జీవిత భాగస్వామిని, ఆకర్షణను కలిగించేది కూడా ఆయనే. అందుకు శుక్ర భగవానుడి అనుగ్రహం పొందాలనుకునే వారు శుక్రవారం రోజున చేపలకు ఆహారం అందించాలి. ఇది మీ జాతకంలో దోషాలను క్లియర్ చేస్తుంది. వివాహ జీవితంలో సుఖసంతోషాలనిస్తుంది.

కుజదోషం ఉన్నవారికి..

కుజుడు కలహకారకుడు. యుద్ధాన్ని ప్రేరేపిస్తాడు. ఈ గ్రహ శాంతి జరగకపోతే.. వారెప్పుడూ ఆవేశంతో ఊగిపోతారు. తొందరపాటు నిర్ణయాలతో ఇబ్బందులు పడతారు. మంగళవారం కోతులకు బెల్లం ఇవ్వండి. ఫలితంగా మీరు అంగారకుడి ఆశీర్వాదం పొందుతారు.

గురువు బావుంటే అంతా బాగున్నట్టే..

గురువారం బృహస్పతికి అనుకూలం. ఈ రోజు నానబెట్టిన పప్పును, బెల్లాన్ని ఆవులు, గుర్రాలకు ఆహారంగా ఇవ్వాలి. ఫలితంగా గురుడి అనుగ్రహం పొందుతారు. అంతేకాకుండా గురువారం నాడు పావురాలకు ఆహారం అందించినా మంచి జరుగుతుంది.

శని దోషాలను తొలగించే రెమిడీ..

శని గ్రహం ఒకరి జాతకంలో ఎంతో కీలకమైంది. శనిభగవానుడు జాతకంలో చెడిపోతే ఎన్నో ఇబ్బందులను పెడతాడు. వీరు శనివారాల్లో నూనె లేదా వెన్నతో తయారు చేసిన రొట్టేను నల్ల ఆవుకు తినిపించాలి. లేదా కుక్కకు ఆహారంగా ఇవ్వాలి. ఇలా చేస్తే జీవితంలో సుఖసంతోషాలు వస్తాయి.

రాహువు-కేతువు..

రాహు, కేతువులు సహజంగానే పాప గ్రహాలు. వీరు శాంతించాలంటే గేదెలకు, ఏనుగులకు పచ్చగడ్డిని ఆహారంగా పెట్టాలి. పెంపుడు జంతువులు లేదా కుందేలు, ఆవును జాగ్రత్తగా చూసుకోవాలి. చీమలకు నువ్వులను ఆహారంగా ఇచ్చినా ఈ గ్రహ దోషాల నుంచి రిలీఫ్ పొందుతారు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే..