చంద్రబాబు వద్దకు ఈ ఇద్దరికి నో పర్మిషన్, వారి బొకేలు కూడా తీసుకోని సీఎం

IAS, IPS Officers Que to Meet CM Chandrababu : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గన్నవరం ఐటీ పార్క్ సమీపంలోని కేసరపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఏపీ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేశారు.


డిప్యూటీ సీఎంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లు ప్రమాణం చేశారు. వీరితో పాటు మరో 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా సహా సినీ, రాజకీయ , ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు తరలివచ్చారు.

బాధ్యతల స్వీకరణ
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. గురువారం సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్‌లోని తన ఛాంబర్లో పండితుల మంత్రోచ్చారణల మధ్య బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ తదితరులు ఉన్నారు. సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధశాఖలకు చెందిన ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

మెగా డీఎస్సీ పై మొదటి సంతకం
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ పత్రంపై మొదటి సంతకం చేశారు. (కేటగిరిల వారీగా : ఎస్జీటీ : 6,371; పీఈటీ : 132; స్కూల్ అసిస్టెంట్స్: 7725; టీజీటీ: 1781; పీజీటీ: 286; ప్రిన్సిపల్స్: 52) ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు ఫైల్‌పై రెండో సంతకం, సామాజిక పింఛన్లు రూ.4వేలకు పెంపు దస్త్రంపై మూడో సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, స్కిల్ క్యాలిక్యులేషన్ పై ఐదో సంతకం చేశారు.

ఐఏఎస్, ఐపీఎస్ ల క్యూ
చంద్రబాబు బాధ్యతల స్వీకరణ సందర్భంగా సచివాలయం మొదటి బ్లాక్ లోని సీఎం చాంబర్ వద్ద కోలాహలం నెలకొంది. బాధ్యతలు చేపట్టిన సీఎం చంద్రబాబును టీడీపీ నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు, పలువురు అధికారులు కలిసి శుభాకాంక్షలు చెప్పారు. ఆ సమయంలో కాగా, కొందరు వివాదాస్పద ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. వారిలో శ్రీలక్ష్మి, అజయ్ జైన్, సునీల్ కుమార్, పీఎస్సార్ ఆంజనేయులు ముఖ్యమంత్రి కార్యాలయం వద్దకు వచ్చారు. అయితే, చంద్రబాబును కలిసేందుకు వారికి పర్మీషన్ దక్కలేదు. దాంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఐఏఎస్ శ్రీలక్ష్మి గతంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. పీఎస్సార్ ఆంజనేయులు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. సునీల్ కుమార్ వైసీపీ హయాంలో సీఐడీ చీఫ్ గా పనిచేశారు.

వారి తీరు బాధించింది
గడచిన ఐదేళ్లలో కొందరు ఐఏఎస్ ల తీరు బాధించిందని ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సచివాలయంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో అన్నారు. వారుఇలా వ్యవహరిస్తారని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు. 1995 నుంచి పలు దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నా ఇలాంటి పరిస్థితిని తాను ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు అన్నారు. గడచిన ఐదేళ్లలో వారు వ్యవహరించిన తీరుపై ఆత్మ విమర్శ చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. త్వరలోనే మరోసారి శాఖల వారీగా ఐఏఎస్, ఐపీఎస్ లతో సమావేశం అవుతానన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రవీణ్ ప్రకాష్, శ్రీ లక్ష్మీ, పీఎస్ఆర్ ఆంజనేయులు అందించిన బొకేలను చంద్రబాబు తిరస్కరించినట్లు సమాచారం.