అన్నమయ్య జిల్లా, మదనపల్లె పట్టణంలో బుధవారం మార్నింగ్ ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఎగువ కురవంక ఆంజనేయ స్వామి గుడి దగ్గర్లోని.. పోస్టల్ అండ్ టెలికమ్ కాలనీలో జీఆర్టీ స్కూల్ టీచర్ దొరస్వామి ఉంటున్నారు.
ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడుగా గుర్తింపు పొందారు. ఆయన భార్య లత ఏడాదన్నర కిందట చనిపోయారు. అప్పటి నుంచి తన కూతురు, పాతికేళ్ల హరితను తండ్రే చూసుకుంటున్నారు. ఆమె బీఎస్సీ బీఈడీ చదివింది. ఈ పరిస్థితుల్లో దొరస్వామి త్వరలో టీచర్ ఉద్యోగం నుంచి రిటైర్ కాబోతున్నారు. రిటైర్మెంట్ సమయంలో వచ్చే డబ్బుతో .. కూతురికి పెళ్లి చెయ్యాలనుకున్నారు. ఇందుకోసం కుప్పంలో ఓ సంబంధం వెతికారు. సుమారు రూ.80 లక్షల విలువైన రెండు అంతస్తుల భవనం ఆస్తిని ఈ మధ్యే తన కూతురు హరితకు పసుపు కుంకుమగా రిజిస్ర్టేషన్ చేశారు. అలాంటిది.. ఆయన్ని కూతురే ఎందుకు చంపించింది?
విగత జీవిగా?
మద్యం తాగే అలవాటున్న దొరస్వామి.. బుధవారం రాత్రి మద్యం తాగి నిద్రపోయారు. తెల్లారి చూస్తే స్థానికులకు శవమై కనిపించారు. దాంతో మదనపల్లి పోలీసులకు సమాచారం అందింది. డీఎస్పీ ప్రసాద్ రెడ్డి వన్ టౌన్, తాలుకా సీఐలు వల్లి బసు, శేఖర్, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం చేరుకుని డెడ్‌బాడీని పరిశీలించారు. కొన్ని ఆధారాలు సేకరించారు.
కూతురి ప్లాన్:
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. కూతురే తండ్రిని చంపించింది. ఇందుకు ఇద్దరు ప్రియుడులను ఉపయోగించుకుంది. మర్డర్ జరిగిన సమయంలో హరిత ఇంట్లోనే ఉండటంతో.. పోలీసులు ఆమెను ప్రశ్నించారు. మొదట ఎవరో వచ్చి చంపేశారని చెప్పింది. కానీ పోలీసులు గుచ్చి గుచ్చి అడిగేసరికి.. దొరికిపోయింది. తానే చంపానని చెప్పింది. తండ్రి తనపై లైంగిక వేదింపులకు పాల్పడటంతో చంపానంది. అది కూడా కట్టుకథలా ఉండటంతో.. పోలీసులు నమ్మలేదు. నిజం చెప్పు అన్నారు.
పోలీసులు వదిలేలా లేరనుకున్న హరిత.. నిజం చెప్పింది. ఆమెకు ఇద్దరు ప్రియుడులు ఉన్నారు. అదే ఇంట్లో పై అంతస్తులో ఇద్దరితోనూ రహస్యంగా సహజీవనం చేస్తోంది. ఒకరోజు ఒకరు, మరో రోజు మరొకరు పై అంతస్తుకు వస్తారు. ఇది గమనించిన స్థానికులు.. దొరస్వామికి విషయం చెప్పారు. దాంతో కుమిలిపోయిన ఆయన.. త్వరగా పెళ్లి చెయ్యాలని డిసైడ్ అయ్యారు. ఇక్కడే వార్ మొదలైంది. తనకు వేరే వ్యక్తితో పెళ్లి వద్దని హరిత చెప్పింది. తండ్రి ఒప్పుకోలేదు. రోజూ ఇదే గొడవ. దాంతో ఓ రోజు ఏకంగా తండ్రినే లేపేయాలని డిసైడ్ అయ్యింది.
మర్డర్ ప్లాన్:
తను వేసిన ప్లాన్ ప్రకారం హరిత.. ఒక ప్రియుడికి రూ.10 లక్షల సుఫారీ ఇచ్చింది. ఆ తర్వాత హత్య జరిగింది. ఐతే.. దొరస్వామిని ఎవరు చంపారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే.. లవర్స్‌లో ఒకడు.. హత్య జరిగిన సమయంలో.. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్‌లో ఉన్నాడు. మరొకడు ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు. హరిత మాత్రం.. చపాతీలు చేసే కర్రతో, ఇనుప రాడ్డుతో తానే కొట్టి చంపానని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. కానీ హత్య జరిగిన తీరును బట్టీ.. ఆమె మాత్రమే అది చేసి ఉండకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆమెకు కనీసం ఇద్దరు ముగ్గురు సహకరించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పూర్తి దర్యాప్తు తర్వాతే అసలు విషయం తెలుస్తుంది.