అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించాడు. జనవరి 20న అధ్యక్ష భవనంలోని రోటుండా హాల్‌లో ఈ కార్యక్రమం ప్రపంచ అతిరథ మహారథుల నడుమ నిర్వహించారు.
ట్రంప్ వస్తే ఏమౌతుందో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.. ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో.. ఏ దేశానికి నష్టం కలుగుతుందో.. ఏ దేశానికి లాభం కలుగుతుందో.. ఎవరితో దోస్తీ చేస్తాడో.. ఎవరితో కుస్తీ పడతాడో అని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ట్రంప్ తన 2.O మార్క్ పాలన ఎలా ఉంటుందో మొదటి రోజే చూపించారు. ఒక్క కలం పోటుతో అమెరికాలోని లక్షల మంది భారతీయుల్లో(Lakhs of Indians) వణుకు పుట్టించాడు. అనేక దేశాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నాడు. ఉత్తర్వులు కూడా జారీ చేశాడు.
ఇక తిరుగుటపాలో..
అక్రమంగా అమెరికాకు వలస వెళ్లిన వారిని వెంటనే తిరుగు టపాలో పంపించక తప్పదని ట్రంప్ ప్రకటించారు. దీంతో లక్షల మందిలో గుబులు రేపుతోంది. గడ్డకట్టిస్తున్న చలికన్నా.. ఎక్కువగా వణికిస్తోంది. తాత్కాలిక వీసా(Temporary visa)లపై వచ్చిన వారిదీ ఇదే పరిస్థితి. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న వారు సుమారు 1.40 కోట్ల మంది ఉంటారని అంచనా. వీరిలో భారతీయులు 7.25 లక్షల మంది. మెక్సికో, సాల్వెడర్ ప్రజల తర్వాత ఎక్కువగా ఉన్నది భారతీయులే. ఎన్నికల ప్రచారం నుంచే వలస వాదులను తరిమేస్తానని చెబుతూ వచ్చిన ట్రంప్.. అధికారం చేపట్టగానే చెప్పినట్లు చేశాడు. దీంతో ఇంతకాలం ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అన్న సంకేతాలు ఇచ్చాడు.
గతంలోనూ అమలు..
అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్ ఉన్నప్పుడు కూడా భారతీయలు సరైన పత్రాలు లేనికారణంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇలా 1,529 మందిని పంపించారు. ట్రంప్ రాకతో ఈ పరిస్థితి ఇంకా తీవ్రమైంది. ఒక యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుని, సరిహద్దులు దాటి అగ్రరాజ్యంలోకి వచ్చేందుకు ఇదివరకు వీలుండేది. కొత్త సర్కార్ తీనికి స్వస్తి పలికింది.
జన్మతః లభించే పౌరసత్వానికి చెక్..
అమెరికా గడ్డపై పుట్టిన ఇతర దేశాల వారికి జన్మతః లభించే పౌరసత్వాన్ని రద్దు చేయాలని ట్రంప్ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో భారతీయులకు ఇబ్బంది కలుగనుంది. అమెరికా జనాభాలో 50 లక్షల(1,47 శాతం) మంది భారతీయులే. వీరిలో మూడోవంతు అమెరికాలో పుట్టినవారే. మిగతావారు వలసదారుల. తాత్కాలిక వీసాపై అమెరికా వెళ్లి. గ్రీన్‌కార్డు కోసం వేచి చూస్తున్నవారికి పుట్టిన సంతానానికి అమెరికా పౌరసత్వం లభించదు. పిల్లలకు పౌరసత్వం లభించాలన్న ఉద్దేశంతో చాలా మంది భారతీయులు కాన్పు కోసం అమెరికా వెళ్తుంటారు. ఇకపై దీనికి బ్రేక్ పడనుంది. తల్లి అక్రమంగా ఉంటున్నా.. తండ్రి అమెరికా పౌరుడు కాకపోయినా పౌరసత్వం రద్దవుతుంది. కాన్పు అమెరికాలో జరిగినా ఇకపై పౌరసత్వం రాదు.
అమెరికా ప్రజలకూ ఇబ్బందే
ట్రంప్ నిర్ణయం అమెరికా ప్రజలకూ ఇబ్బందే అంటున్నారు నిపుణులు. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాపై అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులకు జన్మించిన పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించడం ఇక అసాధ్యం. అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయులే. వీరిలో కొందరు ఇతర దేశాలకు చెందిన వారిని అక్కడే పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటివారు ఇకపై పిల్లల పౌరసత్వం విషయంలో సమస్య ఎదుర్కోనక తప్పదు .