Instant Junnu : జున్ను పాలు లేకున్నా.. జున్నును మీరు ఎప్పుడంటే అప్పుడు.. ఇలా 15 నిమిషాల్లో చేసుకోవచ్చు..!
Instant Junnu : జున్ను.. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. జున్నును తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అయితే ప్రస్తుత కాలంలో స్వచ్ఛమైన జున్ను దొరకడమే కష్టమై పోతుంది.
అంతేకాకుండా ఇన్ స్టాంట్ జున్ను పౌడర్ కూడా మనకు బయట మార్కెట్ లో లభ్యమవుతుంది. అయితే ఈ ఇన్ స్టాంట్ జున్ను పౌడర్ తో కూడా చక్కటి రుచి కలిగి ఉండే జున్నును తయారు చేసుకోవచ్చు. జున్ను పౌడర్ తో రుచిగా జున్నును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జున్ను తయారీకి కావల్సిన పదార్థాలు..
ఇన్ స్టాంట్ జున్ను పొడి – 100 గ్రా., పాలు – 500 గ్రా., బెల్లం తురుము – అర కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్.
జున్ను తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పాలను తీసుకోవాలి. తరువాత అందులో బెల్లం తురుము, జున్న పొడి వేసి బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి. తరువాత యాలకుల పొడి, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఒక కళాయిలో లేదా పెద్ద గిన్నెలో స్టాండ్ ను ఉంచి అది మునిగే వరకు నీటిని పోయాలి. నీళ్లు మరిగిన తరువాత అందులో జున్ను పాలను పోసిన గిన్నెను ఉంచి మూత పెట్టాలి. దీనిని మధ్యస్థ మంటపై 25 నిమిషాల నుండి 30 నిమిషాల వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత చాకుతో జున్ను లోపలికి గుచ్చి చూడాలి.
చాకుకు పాలు అంటుకోకపోతే జున్ను ఉడికినట్టుగా భావించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకవేళ చాకుకు పాలు అంటుకుంటే మరికొద్ది సేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని పూర్తిగా చల్లారే వరకు ఉంచాలి. తరువాత ఈ జున్నును ఫ్రిజ్ లో ఉంచి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత గిన్నె నుండి వేరు చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జున్ను తయారవుతుంది. ఈ విధంగా చేసిన జున్ను కూడా స్వచ్ఛమైన జున్నులా చాలా రుచిగా ఉంటుంది. జున్ను తినాలనిపించినప్పుడు ఈ విధంగా జున్నును చేసుకుని తినవచ్చు.