సెంచరీలతో చెలరేగిన 10, 11 నంబర్‌ ఆటగాళ్లు.. క్రికెట్‌ చరిత్రలో రెండోసారి ఇలా..!

www.mannamweb.com


రంజీ ట్రోఫీ 2024 ఎడిషన్‌లో ముంబై టెయిలెండర్లు చారిత్రక ప్రదర్శన చేశారు. బరోడాతో జరుగుతున్న రెండో క్వార్టర్‌ ఫైనల్లో ఈ జట్టుకు చెందిన 10, 11వ నంబర్‌ ఆటగాళ్లు మెరుపు శతకాలతో విరుచుకుపడ్డారు. 10వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తనుశ్‌ కోటియన్‌ (129 బంతుల్లో 120 నాటౌట్‌; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన తుషార్‌ దేశ్‌పాండే (129 బంతుల్లో 123; 10 ఫోర్లు, 8 సిక్సర్లు) రికార్డు శతకాలు చేసి చరిత్రపుటల్లోకెక్కారు.

ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ చరిత్రలో 10, 11వ నంబర్‌ ఆటగాళ్లు సెంచరీలు చేయడం ఇది లం రెండోసారి మాత్రమే. 78 ఏళ్ల క్రితం (1946) సర్రేతో జరిగిన ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లో భారత 10, 11 నంబర్‌ ఆటగాళ్లు చందు సర్వటే, షుటే బెనర్జీ సెంచరీలు చేశారు. తాజాగా తనుశ్‌-తుషార్‌.. చందు సర్వటే-షుటే బెనర్జీ జోడీ సరసన చేశారు. తనుశ్‌ -తుషార్‌ జోడీ శతకాల మోత మోగించడంతో బరోడాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై భారీ ఆధిక్యాన్ని సాధించింది.

వీరితో పాటు ఓపెనర్‌ హార్దక్‌ తామోర్‌ (114) కూడా సెంచరీతో కదంతొక్కడంతో ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 569 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 36 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని ముంబై.. బరోడా ముందు 606 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులకు ఆలౌట్‌ కాగా.. బరోడా 348 పరుగులు (తొలి ఇన్నింగ్స్‌లో) చేసింది. ఆఖరి రోజు రెండో సెషన్‌ సమయానికి బరోడా వికెట్‌ నష్టానికి 79 పరుగులు చేసి, లక్ష్యానికి 527 పరుగుల దూరంలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఫలితం తేలకపోయినా, తొలి ఇన్నింగ్స్‌లో లభించిన లీడ్‌ ఆధారంగా ముంబై సెమీస్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌లో బరోడా బౌలర్‌ భార్గవ్‌ భట్‌ 14 వికెట్లు (7/112, 7/200) పడగొట్టడం విశేషం.