Officer’s Village In India: ఆ ఊరు.. ఐఏఎస్‌ల ఫ్యాక్టరీ..

www.mannamweb.com


Madhopatti, Uttar Pradesh’Officer’s Village: ఉన్నవి 75 గడపలు. దాదాపు ప్రతి ఇంటి నుంచి ఓ ఉన్నతాధికారి దేశానికి సేవలు అందిస్తుండటం ఆ ఊరు ప్రత్యేకత.
ఐఏఎస్‌-ఐపీఎస్‌ల ఫ్యాక్టరీగా పేరొందిన ఆ గ్రామం మాధోపట్టి. ఉత్తరప్రదేశ్ జౌన్‌పూర్ జిల్లాలో ఉంది అది.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్(CSE) ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షగా పేరుంది. సివిల్స్ కల నెరవేర్చుకునేందుకు ఏటా పది లక్షల మంది పోటీపడుతుంటారు. దేశవ్యాప్తంగా ఉండే ఖాళీలు మాత్రం వేలల్లోనే. సివిల్స్ ఫైనల్ లిస్టులో చోటు దక్కిందా.. ఇక వారు అదృష్టవంతులే.

దేశంలో మరే రాష్ట్రం అందించనంత స్థాయలో ఉత్తరప్రదేశ్ సివిల్స్ అధికారులను అందించింది. మాధోపట్టి గ్రామమే ఇప్పుడు దేశాన్ని నడిపిస్తోందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అక్కడున్న 75 ఇళ్లలో ప్రతి ఇంటి నుంచి ఐఏఎస్ లేదా పీసీఎస్(ప్రొవిన్షియల్ సివిల్ సర్వీస్) కేడర్ అధికారి వచ్చాడంటే అర్థం చేసుకోవచ్చు ఆ గ్రామం గొప్పతనం.
ఇప్పటివరకు మాధోపట్టి 51 మందిఉన్నతాధికారులను దేశానికి అందించింది. పోనీ.. ఆ ఊళ్లో ఏదైనా కోచింగ్ సెంటర్ ఉందా అంటే.. అదీ లేదు. అయినా పెద్ద సంఖ్యలో ఐఏఎస్‌లను ఉత్పత్తి చేసిన విలేజ్‌గా ప్రత్యేకతను సాధించుకుంది. స్పేస్, ఆటమిక్ రిసెర్చ్, జ్యుడీషియల్ సర్వీసెస్, బ్యాంకింగ్.. ఇలా ఒకటేమిటి అన్ని రంగాల్లోనూ మాధోపట్టి గ్రామస్తులే కీలక పదవుల్లో కనిపిస్తారు.

ఐఏఎస్ సోదరులుగా ఖ్యాతిపొందిన నలుగురు కూడా ఆ గ్రామం నుంచి వచ్చినవారే కావడం మరో విశేషం. వినయ్‌కుమార్ సింగ్, ఛత్రపాల్ సింగ్, అజయ్ కుమార సింగ్, శశికాంత్ సింగ్‌లు మాధోపట్టి గ్రామస్తులే.

1955లో సివిల్ సర్వీసెస్ పూర్తి చేసిన వినయ్‌కుమార్ సింగ్ బిహార్ చీఫ్ సెక్రటరీగా రిటైరయ్యారు. ఆయన ఇద్దరు సోదరులు ఛత్రపాల్ సింగ్, అజయ్‌కుమార్ సింగ్ 1964లో సివిల్స్ ఎగ్జామ్‌లో విజయం సాధించారు. మరో సోదరుడు శశికాంత్ సింగ్ 1968లో ఐఏఎస్‌గా ఎంపికై తమిళనాడు చీఫ్ సెక్రటరీగా పనిచేశారు.

మాధోపట్టి నుంచి తొలి సివిల సర్వెంట్‌గా ముస్తఫా హుసేన్ రికార్డులకి ఎక్కారు. 1914లో ఆయన సివిల్ సర్వీసెస్‌లో చేరారు. ఆయన కొడుకు వమీక్ జౌన్‌పురి ప్రముఖ కవిగా గుర్తింపు పొందారు. ఆ గ్రామం నుంచి 1952లో ఐఏఎస్ అధికారి అయిన రెండో వ్యక్తి ఇందూప్రకాష్.

అయితే పదుల సంఖ్యలో ఐఏఎస్‌లను మాధోపట్టిలో పరిస్థితులు ఇప్పటికీ అధ్వానమే. సరైన రహదారులు ఉండవు. ఉన్నా అన్నీ గుంతలమయమే. ఇక వైద్య సదుపాయాల గురించి చెప్పనక్కర్లేదు. కనీస వైద్యం కూడా దొరకని దుస్థితి నెలకొంది. విద్యుత్తు సౌకర్యమూ అంతే. ఎలాంటి వసతులు లేకున్నా ప్రతిభావంతులైన ఉన్నతాధికారులను అందించిన ఘనతను మాత్రం మాధోపట్టి సొంతం చేసుకుంది.