మిగిలింది ఒక్కరోజే..ఈ రోజైనా విధుల్లోకి తీసుకుని పోస్టింగ్‌ ఇస్తారా?

www.mannamweb.com


ఒక్క రోజు.. ఈ ఒక్క రోజే మిగిలింది. డైరెక్టర్‌ జనరల్‌ ర్యాంక్‌ కలిగిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. ఐదేళ్లుగా ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వకుండా, సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు విధించి, అక్రమ కేసులతో వేధించిన జగన్‌ ప్రభుత్వం, వైకాపా వీరభక్త అధికార గణం.. సుదీర్ఘ సర్వీసులో చివరి రోజైనా ఆయన్ను విధుల్లోకి తీసుకుని పోస్టింగ్‌ ఇస్తుందా? లేదా? ఇప్పటి వరకూ ఆయన పట్ల అనుసరించిన కక్షసాధింపు ధోరణినే కొనసాగిస్తుందా అనేది నేడు తేలిపోనుంది. జగన్‌ ప్రభుత్వ తీరు చూస్తుంటే.. ఏబీవీని విధుల్లోకి తీసుకోకుండానే పదవీవిరమణ చేయించాలనే దురుద్దేశమే కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏబీవీ సస్పెన్షన్‌ చెల్లదని, ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఈ నెల 8న ఆదేశాలిచ్చింది. 22 రోజులు గడిచినా ఆయన్ను విధుల్లోకి తీసుకోలేదు సరికదా! ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. క్యాట్‌ ఆదేశాల నిలుపుదలకు నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు గురువారం ఉత్తర్వులిచ్చింది.

వాటిని ఏబీ వెంకటేశ్వరరావు.. సీఎస్‌ జవహర్‌రెడ్డికి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలోనూ అందజేశారు. చట్టం, నిబంధనలు పాటించే, న్యాయవ్యవస్థ ఆదేశాల అమలుకు కట్టుబడి ఉండే ఏ అధికారైనా సరే వెంకటేశ్వరరావును వెంటనే విధుల్లోకి తీసుకుని పోస్టింగ్‌ ఇవ్వాలి. ఏబీవీపై అభియోగాలు మోపటమే తప్ప గత ఐదేళ్లలో ప్రభుత్వం అవేవీ నిరూపించలేకపోయింది. ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన కేసు తేల్చనేలేదు. క్రిమినల్‌ కేసులోనూ అభియోగపత్రం దాఖలు చేయలేదు. ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టుతో పాటు క్యాట్‌ కూడా ఆయనపై సస్పెన్షన్‌ ఎత్తేయాలని, విధుల్లోకి తీసుకోవాలనే ఆదేశాలిచ్చాయి. అయినా జగన్‌ సర్కారు వాటన్నింటినీ బేఖాతరు చేస్తూనే ఉంది. ఏబీవీ తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకోవటాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ అభియోగాలు నిరూపించట్లేదు. సస్పెన్షన్‌ ఎత్తేయాలని న్యాయస్థానాలు ఆదేశాలిచ్చినా అమలు చేయట్లేదు. పదవీవిరమణ చివరి రోజు వరకూ ఏబీవీని విధుల్లోకి తీసుకోకపోవటం ప్రభుత్వ ఫ్యాక్షనిజం కాదా?

ఆయనకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు?
క్యాట్‌ ఆదేశాల నిలుపుదలకు నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు గురువారం ఉదయమే ఆదేశించినప్పటికీ.. రాత్రి వరకూ ఏబీ వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకుంటూ సీఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులివ్వలేదు. శుక్రవారం ఏబీవీ పదవీ విరమణ చేయనున్నారు. అప్పటి వరకూ ఆయన్ను సస్పెన్షన్‌లో కొనసాగిస్తూ పోస్టింగ్‌ లేకుండానే సాగనంపాలనే దురుద్దేశంతోనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందన్న చర్చ పోలీసు వర్గాల్లో సాగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారుల సీనియార్టీ జాబితాలో ఏబీ వెంకటేశ్వరరావు అగ్రస్థానంలో ఉన్నారు. అలాంటి సీనియర్‌ అధికారిని ప్రభుత్వమే ఇంతలా వెంటాడి, వేటాడి వేధించిన ఘటనలు దేశచరిత్రలోనే అరుదు. కానీ 34 ఏళ్ల పాటు పోలీసుశాఖకు సేవలందించిన ఏబీవీకి కేవలం కక్షసాధింపు కోసం జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లపాటు పోస్టింగు ఇవ్వలేదు. దాదాపు నాలుగున్నరేళ్లుగా సస్పెన్షన్‌లో ఉంచింది. డీజీ క్యాడర్‌ అధికారైన ఏబీవీకి జగన్‌ ప్రభుత్వం వల్ల జరిగిన నష్టం పూడ్చలేనిది. ఎవరైనా తమ కెరీర్‌ చివరిదశలో అత్యున్నత పోస్టుల్లో బాధ్యతలు నిర్వహిస్తారు. అలాంటి అవకాశం లేకుండా ఆయన పదవీవిరమణ వరకూ సస్పెన్షన్‌లో ఉంచటం ప్రభుత్వ కక్షపూరిత విధానాలకు నిదర్శనం.

కాకులకు ఉన్న సంఘీభావ స్ఫూర్తి.. ఐపీఎస్‌ అధికారుల సంఘానికి లేదా?
ఒక కాకికి ఆపదొస్తే.. చుట్టూ పది కాకులు చేరి సంఘీభావం తెలుపుతాయి. అలాంటిది ఎంతో గొప్పగా చెప్పుకొనే ఐపీఎస్‌ అధికారుల్లో ఆ సంఘీభావం ఏమైపోయింది? ఆయన పదవీవిరమణ చేసే వరకూ విధుల్లోకి తీసుకోకుండా కక్ష సాధిస్తుంటే.. దాన్ని ఖండించాలని అనిపించలేదా? అధికార వైకాపా అంటే ఇంత భయమా? లేకా వీర భక్తా? వైకాపాతో అంటకాగుతూ.. ఎన్నికల్లో ఆ పార్టీకి లబ్ధి కలిగించేలా పనిచేసిన ఐపీఎస్‌ అధికారులపై పత్రికల్లో కథనాలు రాస్తే.. వారందరి తరఫున వకాల్తా పుచ్చుకుని ఐపీఎస్‌ అధికారుల సంఘం ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడి హోదాలో కాంతిరాణా తాతా వాటిని ఖండిస్తూ, మీడియాను విమర్శిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీడియాపైన రాజకీయ విమర్శలు చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు.

మరి ఏబీవీకి తీవ్ర అన్యాయం జరుగుతుంటే కాంతి రాణా ఇప్పుడు ఎక్కడున్నారు? ఆయన ఎందుకు స్పందించట్లేదు? ఐపీఎస్‌ అధికారుల సంఘం ఎక్కడుంది? ఎందుకు మాట్లాడదు?

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఎత్తేయాలని, ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని పేర్కొంటూ క్యాట్‌ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని ఐపీఎస్‌ అధికారుల సంఘం సీఎస్‌కు కనీసం ఒక లేఖైనా రాసిందా? ఏబీవీకి సంఘీభావంగా ఒక్క సమావేశమైనా నిర్వహించిందా? ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఒక ప్రకటనైనా విడుదల చేసిందా? వైకాపా అనుకూల అధికారులకు ఇబ్బందులొచ్చినప్పుడు, వారిపై విపక్షాలు విమర్శలు చేసినప్పుడు ఖండించటానికే ఐపీఎస్‌ అధికారుల సంఘం ఉందా?
వైకాపాకు కొమ్ముకాస్తూ పనిచేసే అధికారుల తీరును ఎండగడుతూ ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శలు చేస్తే మీసాలు మెలేసి మరీ ప్రతిపక్ష నాయకులపై విరుచుకుపడిన ఏపీ పోలీసు అధికారుల సంఘం ఏమైపోయింది? ఏబీవీకి జరిగిన అన్యాయంపై ఎందుకు ప్రశ్నించట్లేదు?
ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా సామాన్య పౌరులు ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వాలంటూ గురువారం సాయంత్రం వరకు 44,222 మంది ఛేంజ్‌.ఓఆర్‌జీలో సంతకాలు చేసి రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ప్రధానమంత్రికి పంపించారు. సామాన్య పౌరులు చూపిన సంఘీభావం కూడా ఐపీఎస్‌ అధికారుల సంఘం చూపలేకపోయింది.
జవహర్‌రెడ్డీ.. కోర్టు ఆదేశాలంటే మీకు లెక్కలేదా?

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న జవహర్‌రెడ్డి.. ఏబీవీపై సస్పెన్షన్‌ ఎత్తేయాలంటూ క్యాట్‌ ఇచ్చిన ఆదేశాలను ఇప్పటి వరకూ ఎందుకు అమలు చేయలేదు? ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆఘమేఘాలపై హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌లో పిటిషన్‌ వేశారే.. మరి అదే హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయట్లేదు? ఇది కోర్టు ధిక్కారం కాదా? క్యాట్, హైకోర్టు ఉత్తర్వుల ప్రతుల్ని ఏబీ వెంకటేశ్వరరావు మీకు అందజేసి.. వాటిని అమలు చేయాలని కోరినా ఎందుకు విధుల్లోకి తీసుకోలేదు? సీనియర్‌ అధికారిపై ప్రభుత్వ పెద్దలు కక్ష సాధిస్తుంటే.. ఆ చర్యలను అమలు చేస్తున్న మిమ్మల్ని ఏమనాలి?