పవన్ కళ్యాణ్ నూటికి నూరు శాతం విజయం నమోదు చేసుకున్నారు. అంటే తన పార్టీ నుండి నిలబడిన అభ్యర్థులు అందరినీ గెలిపించుకున్నారు. అభిమానులు ముద్దుగా పవర్ స్టార్ అని పిలుచుకునే పవన్ కళ్యాణ్, త్వరలోనే పవర్ ఫుల్ హోమ్ మినిస్టర్ పదవిని అలంకరిస్తారని అభిమానులు ఆశగా వున్నారు. నిజజీవితంలో కూడా పవర్ స్టార్ అవుతారని ఎదురుచూస్తున్నారు.
నాకు 21 సీట్లు గెలిపించండి, భారతదేశం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ వైపుకు చూసేలా చేస్తాను అని ఒక సభలో అన్న పవన్ కళ్యాణ్ ఆ మాటని నిజం చేసి చూపించారు. కూటమిలో తన పార్టీకి కేటాయించిన 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకొని ఎన్ని సీట్లలో పోటీ చేశారో, అన్ని సీట్లు గెలిచి వంద శాతం సక్సెస్ తో రికార్డు సృష్టించారు పవన్ కళ్యాణ్. అదీ కాకుండా సెంట్రల్ లో వున్న భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చి, తెలుగు దేశం పార్టీ తో పొత్తు పెట్టుకునేట్టు చేశారు పవన్ కళ్యాణ్. ఆ పొత్తువలనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచిన రెండు పార్లమెంటు స్థానాలు, తెలుగు దేశం గెలిచిన 16 స్థానాలు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడానికి కీలకం అయ్యాయి. అందుకే భారతదేశం మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపుకే చూస్తోంది. (Pawan Kalyan is going to be the new Home Minister of Andhra Pradesh?)
ఇదిలా ఉంటే, వెండితెరపై ఎన్నో జీవితానికన్నా మిన్నగా వుండే పాత్రల్లో నటించిన పవన్ కళ్యాణ్ ని, పవర్ స్టార్ గా అభిమానులు పిలుచుకుంటూ వుంటారు. అతను తన పాత్రలతో లక్షలాది అభిమానులను మెప్పిస్తూ వుంటారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వెండితెరపైనే హీరోగా చెయ్యడం కాదు, నిజ జీవితంలోనూ హీరో అయ్యారు. నిన్న జరిగిన ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రక్రియలో తెలుగు దేశం, బీజేపీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీ తో గెలవడానికి పవన్ కళ్యాణ్ కీలకం అయ్యారు. అందుకే 135 సీట్లు గెలిచిన తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ కి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అని ఎన్నోసార్లు చెప్పారు. (Pawan Kalyan fans wanted to see him as Home Minister of Andhra Pradesh)
నిన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి చంద్రబాబునాయుడు ఆలింగనం చేసుకొని, అభినందనలు తెలిపారు. అంటే పవన్ కళ్యాణ్ నిన్నిటి గెలుపులో ఎంతటి పెద్ద పాత్ర పోషించారో అందరూ ఊహించుకోవచ్చు. వెండితెరపై నటుడిగా వున్న, పవన్ కళ్యాణ్ నిజజీవితంలో హీరో అయ్యారు. తనవలనే ఇంతటి విజయం వచ్చిందని అందరూ అంటున్న, తానేమీ పెద్దగా సంబరపడిపోలేదు, ఎగిరి గంతులు వెయ్యలేదు, వినమ్రంగానే అన్నీ స్వీకరించారు. పవర్ వచ్చింది కదా అని చాలామంది చాలా మాటలు మాట్లాడుతారు, కానీ పవన్ కళ్యాణ్ అటువంటి మాటలు ఏమీ మాట్లాడకుండా, ఎంతో వినమ్రతతో, నవ్వుతూ అందరినీ పలకరించారు. తనలో ఒక్క పిసరంత గర్వం కూడా కనిపించలేదు. అందుకే కదా, అతనికి లక్షలాది అభిమానులు నీరాజనాలు పడుతున్నారు. అటువంటి నాయకుడు కావాలనే అతని అభిమానులు ఇన్నాళ్లు ఎదురు చూస్తున్నారు. గర్వంగా అసెంబ్లీలో అడుగుపెడతా అన్నారు, అలానే ఎంతో హుందాగా, గౌరవంగా, గర్వంగా అడుగుపెడుతున్నారు. (Power Star Pawan Kalyan is going to be the powerful man in real life too)
ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ కి ఎటువంటి పదవి లభిస్తుందో అని ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే కూటమిలో జనసేన పార్టీ భాగస్వామ్యం కాబట్టి, ఈ పార్టీకి కూడా మంత్రి పదవులు ఇవ్వనున్నారు అని తెలుస్తోంది. అందుకే అభిమానులు అందరూ పవన్ కళ్యాణ్ కి హోమ్ మినిస్టర్ మంత్రి పదవితో పాటు ఉప ముఖ్యమంత్రిగా కూడా చేస్తారని ఎదురుచూస్తున్నారు. “మాకయితే పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ ఫుల్ మినిస్టర్ గా ఉండబోతున్నారు అని అనుకుంటున్నాం, అలాగే ఉప ముఖ్యమంత్రిగా కూడా చూడాలని వుంది,” అని చెప్పారు, ప్రదీప్ రెడ్డి, పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ నాయకుడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుకోసం అక్కడ ప్రచారం చేసిన వాళ్లలో ప్రదీప్ రెడ్డి కూడా వున్నాడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు కోసం మా అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నాం, ఎందుకంటే అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఎటువంటి హోదాలో ఉండబోతున్నారు అనేది తెలుస్తుంది.
ఒకవేళ హోమ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే కనక, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు నిజ జీవితంలో కూడా చాలా పవర్ ఫుల్ పవర్ స్టార్ అవుతారు. పరిశ్రమలో కూడా అందరూ ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి సినిమా పరిశ్రమలో అందరితో సత్సంబంధాలు వున్నాయి. ఇంతకు ముందు ప్రభుత్వం పరిశ్రమకి చేసిందేమీ లేదు, పరిశ్రమతో అంతగా సంప్రదింపులు ఎక్కువగా జరపలేదు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రభుత్వంలో ఉంటే, పరిశ్రమకి మంచి జరుగుతుంది అని పరిశ్రమలో అందరూ అనుకుంటూ వున్నారు. పరిశ్రమతో పాటు పవర్ స్టార్ అభిమానులు కూడా ఆ సమయం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.